రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 958 హాళ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సమీక్షించారు. కరోనా నెగెటివ్, రెండు డోసుల వ్యాక్సినేషన్ పత్రం తీసుకొచ్చినవాళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో 571 ఎంపీటీసీ, 45 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇన్నాళ్లూ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన బ్యాలెట్లను కాసేపట్లో లెక్కించనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో 598 టేబుళ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను 31 కేంద్రాల్లో లెక్కించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పది ప్రదేశాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ స్థానాలకు, వెయ్యి ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడేలా ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తణుకు కేంద్రాల్లో ఓట్లలెక్కింపు నిర్వహించనున్నారు. జిల్లాలో 45 జెడ్పీటీసీ స్థానాలకు, 781ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 45కౌంటింగ్ హాళ్లు, 715 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో 41 జెడ్పీటీసి స్థానాలకు, 367 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా... పోలైన ఓట్లను లెక్కించేందుకు 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 109 హాల్స్ లో లెక్కింపు జరగనుంది.