vishakapatnam railway zone issue in Loksabha: వైజాగ్ రైల్వే జోన్ ఎప్పటినుంచి ప్రారంభమవుతుందో చెప్పలేమని కేంద్ర రైల్వే శాఖ పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు గురించి.. ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మిథున్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, లోక్‌సభలో ప్రశ్నను లేవనెత్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు.
railway minister on vishakapatnam railway zone: 2019 మార్చి 8వ తేదీన దక్షిణ కోస్తా రైల్వే కోసం ప్రత్యేక విధి నిర్వహణాధికారి-ఓఎస్‌డీని నియమించినట్లు చెప్పిన మంత్రి.. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను 2019 ఆగస్టు 26న ఓఎస్‌డి రైల్వే శాఖకు సమర్పించినట్లు చెప్పారు. డీపీఆర్‌కు అనుగుణంగా.. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, తూర్పు కోస్తా రైల్వేలో కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు పనులను రూ.170 కోట్ల అంచనా వ్యయంతో 2020-21 బడ్జెట్‌లో పొందుపరిచామన్నారు. పనుల కోసం రూ.40 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్న మంత్రి.. కొత్త జోన్ ఎప్పటినుంచి పని ప్రారంభిస్తుందో.. కచ్చితమైన సమయం నిర్ధరించలేమని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.