Revanth - Komati Reddy Meet: టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశయ్యారు. హైదరాబాద్‌లో తన నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి.. వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. కోమటిరెడ్డితో భేటీకి సంబంధించిన ఫోటోలను రేవంత్‌రెడ్డి.. హ్యాపీ టైమ్స్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కోమటిరెడ్డి సైతం ట్విట్టర్‌లో ఫోటోలు పంచుకున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. తమ భేటీకి సంబంధించిన ఫోటోలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కలిసి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా రాజాకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని ఆరోపణలు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్‌కు కేటీఆర్ చొరవ చూపాలని సూచించారు. ఆ తర్వాత 3 రోజులు కాకుంటే వారం వేడుకలు జరుపుకున్న అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు వెల్లడించారు.
పీసీసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలకు సహకరిస్తాం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైతులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ చేసే అరాచకాలను అడ్డుకుంటాం. అందరం కలిసి పనిచేస్తాం. పీసీసీ ,సీనియర్ నాయకుల నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. కేసీఆర్ జన్మదిన ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.
- కోమటిరెడ్డి, ఎంపీ
రేపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయాలు, కమిషనరేట్‌ల వద్ద ధర్నాలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు. అసోం సీఎంపై ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
మా ఫిర్యాదులపై పోలీసులు రేపటిలోగా కేసు నమోదు చేయాలి. పోలీసుల తీరును నిరసిస్తూ రేపు కాంగ్రెస్ ఆందోళనలు. రేపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదుట నేను బైఠాయిస్తా... రాచకొండ కమిషనరేట్ వద్ద ధర్నాలో కోమటిరెడ్డి పాల్గొంటానన్నారు.