గత నెల రోజులుగా అనేక వేదికల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనేక ఘటనల్లో వైకాపా తీరును సుతిమెత్తగానే ఎండగడుతున్నారు. తనను పార్టీలో తక్కువ చేస్తున్నారన్న తీరువల్లే ఎంపీ ధోరణిలోనూ మార్పు వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న అనేక ఘటనలు రఘురామకృష్ణరాజుని పార్టీకి దూరం చేశాయి. పార్టీ అధిష్ఠానానికి గౌరవం ఇవ్వకపోవడం వల్లే.. నరసాపురం ఎంపీని పక్కన పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో ఎంపీకి ప్రాధాన్యత కల్పించవద్దని వైకాపా పార్టీ అధిష్ఠానం నుంచి జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అనేక కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. పార్టీలోను ప్రాధాన్యత కోల్పోయారు. ఎంపీ మాటను జిల్లాలో చెల్లుబాటు కాకుండా చేశారని ఆయన వర్గీయులు అంటున్నారు.
దిల్లీ అండతోనే...
దిల్లీ పెద్దలను అధికంగా కలుస్తున్నాడన్న కారణంగానే... వైకాపా అధిష్ఠానం రఘురామకృష్ణరాజును పార్టీకి దూరం చేస్తోందన్న మాటలు గతం నుంచి వినిపిస్తున్నాయి. పార్లమెంటు కమిటీ ఛైర్మన్గా రఘురామకృష్ణంరాజు ఎంపికయ్యాక.. ఈ దూరం మరింత పెరిగింది.
ప్రాధాన్యత లేకుండా చేయడం వల్ల.. సమయం వచ్చినప్పుడుల్లా పలు సందర్భాల్లో ప్రభుత్వంపై సున్నితంగా ఎంపీ విమర్శలు చేస్తున్నాడని అంటున్నారు. తిరుమల ఆస్తుల విక్రయాల్లో సొంత పార్టీ ఎంపీ విమర్శలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి.. ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఎంపీ నోటికి తాళం వేయాలన్న ఉద్దేశంతోనే.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో రఘురామకృష్ణరాజును విమర్శలు చేయిస్తున్నారని మాటలు వినపడుతున్నాయి. స్వయాన రఘురామకృష్ణంరాజే ఈ మాటలు అన్నారు. సొంత సామాజిక వర్గం వారితో తిట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.