ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నోటీసు ఇచ్చే అధికారం మీకెక్కడిది?: ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Jun 25, 2020, 1:29 PM IST

Updated : Jun 26, 2020, 10:11 AM IST

mp-raghuramakrishnaraju-reply-to-ysrcp-show-cause-notice
ఎంపీ రఘురామకృష్ణరాజు

13:27 June 25

వైకాపా అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఎంపీ రిప్లై

తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే అధికారం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి అసలు ఉందా? లేదా? అని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైకాపాలో క్రమశిక్షణ కమిటీ ఉందా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి నుంచి తనకు అందిన లేఖపై పలు సందేహాలు లేవనెత్తుతూ వాటిని తీర్చాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గురువారం ఆయనకే లేఖ పంపారు. అందులో ‘మీ లేఖకు ఇది బదులు మాత్రమే.. సంజాయిషీ కాదు’ అని స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశం...

‘‘మన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ. వైఎస్సార్‌ అని రాసుకునేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అనే పార్టీ అప్పటికే ఉన్నందున అదే పేరును మీకు ఇవ్వలేమని 2015లోనే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే లెటర్‌హెడ్‌పై నాకు లేఖ ఎలా పంపారు? మనది రాష్ట్ర పార్టీ అయితే మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యారు? జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మీరు నాకీ నోటీసు ఇచ్చి ఉంటే, మీకీ అధికారాన్ని అప్పగించినట్లు ఎన్నికల సంఘానికి నివేదించిన పార్టీ బైలాలో చూపించారా? ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన క్రమశిక్షణ కమిటీ మన పార్టీకి ఉందా? ఉంటే దానికి ఛైర్మన్‌ ఎవరు? అందులో సభ్యులెవరున్నారు? ‘షోకాజ్‌’ పేరుతో మీరు పంపిన లేఖకు బదులివ్వడం నా బాధ్యత. అయితే ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన క్రమశిక్షణ కమిటీ పార్టీలో ఉండి, నిబంధనల ప్రకారం ఆ కమిటీ ఈ చర్యలకు దిగి ఉంటే సరే.. అలా కాదంటే మీకు ఇలా నోటీసునిచ్చే అధికారం లేనట్లే. అప్పుడు అందరిని తప్పుదారి పట్టిస్తున్నందుకు ఈ వ్యవహారంపై న్యాయపరంగా తగిన చర్యలు తీసుకునేలా నాకు విధిలేని పరిస్థితిని కల్పించినట్లవుతుంది. మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రిని ఆరాధించే వ్యక్తిగా నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు, మార్గదర్శకాలను గౌరవిస్తా. మీరు పంపిన వర్తమానం అర్హమైనదేనని, సరైనదేనన్న సమాచారం పార్టీ నుంచి సరైన పద్ధతిలో వస్తుందనుకుంటున్నా. అంతవరకూ వేచి చూస్తాను’అని రఘురామకృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు తన బదులు లేఖను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు, దాని ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు కడపలోని అన్న వైఎస్సార్‌ పార్టీ అధ్యక్షుడికి పంపారు.

ఇదీ చదవండి:పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు

Last Updated : Jun 26, 2020, 10:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details