ఏపీ సీబీసీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ తన ఫోన్ ద్వారా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ.. ఆయనపై క్రిమినల్ లయబిలిటీ కింద చర్యలు చేపట్టాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. పీవీ రమేశ్ సోదరికి, అదనపు డీజీ సునీల్‌కుమార్‌కు మధ్య వైవాహిక విభేదాలున్నాయని తెలుస్తోందని ఫిర్యాదులో చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తన ఫోన్ ద్వారా వారికి మోసపూరితంగా వాట్సప్ సందేశాలు పంపి తనను మరో తప్పుడు కేసులో ఇరికించి, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ ఫోన్ నంబరు నుంచి మే 14- జూన్ 1 మధ్య ఇంకెన్ని సందేశాలు వెళ్లాయో దర్యాప్తు చేయాలని కోరారు.
‘మే 14న నన్ను అరెస్టు చేసినరోజు నా భార్య, కుమారుడి సమక్షంలో పోలీసులు నా నుంచి ఐఫోన్ 11 మోడల్ మొబైల్ ఫోన్ తీసేసుకున్నారు. అందులో 90009 22222 నంబరు సిమ్‌తో 90009 11111 వాట్సప్ నంబరు ఉంది. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపలేదు, తిరిగి ఇవ్వనూలేదు. దీనిపై శుక్రవారం సునీల్‌కుమార్‌కు నేను లీగల్ నోటీసు పంపాను. మే 14వ తేదీ రాత్రి ఏపీ సీబీసీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ మరో నలుగురితో కలిసి నన్ను దారుణంగా కొట్టారు. తర్వాత అందులో ఒకరు నా గుండెలపై కూర్చొని నా మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని బలవంతపెట్టారు. నా ప్రాణాలను కాపాడుకోడానికి అది చెప్పాను. నా ఫోన్ నంబరు నుంచి వాట్సప్ సందేశాలు వచ్చినట్లు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ శనివారం ట్వీట్ చేయడం విస్మయాన్ని కలిగించింది. వెంటనే జరిగిన విషయాన్ని ఆయనకు ట్విటర్ ద్వారా వివరించాను. పీవీ రమేశ్ కుటుంబసభ్యులకే కాక.. ఇతర నంబర్లకూ సునీల్‌కుమార్ నా నంబరు నుంచి వాట్సప్ సందేశాలు పంపి ఉండొచ్చన్నది నా అనుమానం. అందువల్ల నా ఫోన్ నుంచి వారు ఏయే నంబర్లకు ఎన్ని సందేశాలు పంపారో పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారానే తేలుతుంది. ఈ కేసులో ఎన్నో చట్టాల ఉల్లంఘన చోటుచేసుకొంది. అందువల్ల పీవీ సునీల్‌కుమార్‌పై సెక్షన్ 119, 379, 403, 409, 418, 426, 504, 506 కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని రఘురామకృష్ణరాజు దిల్లీ డీసీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ లేఖతోపాటు ఆయన పీవీ రమేశ్ చేసిన ట్వీట్, దానికి తానిచ్చిన స్పందన, పీవీ సునీల్‌కుమార్‌కు తానిచ్చిన లీగల్ నోటీసు, తాను మరో సిమ్ తీసుకున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన లేఖను జత చేశారు.
నాకు సందేశాలు వచ్చాయి: పీవీ రమేశ్
ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్ నుంచి తమకు వాట్సప్ సందేశాలు వచ్చినట్లు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ శనివారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. నాకు, నా కుటుంబసభ్యులకు 90009 11111 అనే నంబర్ నుంచి వాట్సప్ సందేశాలు వస్తున్నాయి. బహుశా ఆ నంబరు ఎంపీ రఘురామకృష్ణరాజుది కావచ్చు. దీనిపై ఎంపీ స్పందించాలి’ అని కోరారు. దానిపై ఎంపీ స్పందించి, తన ఫోన్ సీఐడీ పోలీసుల వద్ద ఉన్న విషయాన్ని, నాలుగు రోజుల క్రితం సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకున్న విషయాన్ని ట్వీట్‌లో వివరించారు.