ప్రభుత్వ వ్యక్తిగా ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు సూచించిన దృష్ట్యా ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్‌కు లేఖాస్త్రం సంధించారు. అటు పార్టీ పదవి, ఇటు ప్రభుత్వ సలహాదారుడి పదవిలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తే గౌరవంగా ఉంటుందని రఘురామ సూచించారు. సజ్జల పార్టీ వ్యవహారాలను చూడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను ఈ నెల 6న లేఖ రాసినా.. దాన్ని ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ నియామకంపై హైకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయం కూడా చర్చకు వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వారు రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.
'సజ్జలను ఏదో ఒక పదవికి పరిమితం చేయండి' - ఎంపీ రఘురామ తాజా వార్తలు
ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు సూచించినందున ప్రభుత్వ సలహాదారు సజ్జలను ఏదో ఒక పదవికి పరిమితం చేయాలని ఎంపీ రఘురామ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ నెల 6న ఈ అంశంపై లేఖ రాసినా జగన్ పట్టించుకోలేదని చెప్పారు.
సలహాదారుల నియామక విధి విధానాలపై కోర్టుకు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించిన వార్తలు పలు పత్రికల్లో వివరంగా వచ్చాయని రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ సొంత పత్రికలో మాత్రం ఈ విషయం ప్రచురితం కాలేదని చెప్పారు. వాస్తవాలు ప్రచురించిన పత్రికలను చదవరనే ఉద్దేశంతోనే.. లేఖ ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నట్లు రఘురామరాజు తెలిపారు. కేసులో తదుపరి విచారణ జరిగేలోపే.. సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో ఒక పదవికి పరిమితం చేయాలని సూచించారు. అలా చేస్తే ముఖ్యమంత్రికి గౌరవం దక్కుతుందని, లేకపోతే ఈ అంశం ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలలో మరో ముఖ్యాంశంగా మారుతుందని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:FINANCE DEPARTMENT: 'ప్రభుత్వ లెక్కలన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి'