RRR on Tour: భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. డీజీ ఆఫీసు నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందన్నారు. రఘురామ వస్తే ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు అందాయన్నారు. చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే 20 మంది పోలీసులు చెకింగ్ మొదలుపెట్టారన్నారు. రైలు ఆంధ్రా సరిహద్దుకు చేరుకోగానే అదుపులోకి తీసుకునేందుకు ప్రణాళిక రచించారన్నారు. పోలీసుల్లో కూడా మంచోళ్లు ఉంటారని.. వారే తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు.
రఘురామ హత్యకు కుట్ర:ఎంపీ రఘురామకృష్ణరాజుని సత్తెనపల్లిలో హత్య చేసేందుకు.. తాడేపల్లి నుంచి ప్రణాళిక వెళ్లిందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతికి.. నర్సాపురం రైలుకు రఘురామ వచ్చి ఉంటే.. ఆయనకదే చివరి రోజయ్యేదన్నారు. సొంత పార్టీ ఎంపీని రానీయకుండా ముఖ్యమంత్రి లేఖ ఇప్పించారని ఆరోపించారు.
రఘురామ ఇంటి వద్ద హైడ్రామా: హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు చూపేందుకు నిరాకరించాడు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని అలియాస్ ఫరూక్ అని, రెండు రోజుల క్రితం ఇన్నోవాలో ఆరుగురు పోలీసులం హైదరాబాద్‌కు వచ్చామని చెప్పాడు.