ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.. మిగిలిన వారినైనా కాపాడండి: రఘురామ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సాక్షులు చనిపోయారని.. మిగిలిన వారినైనా కాపాడాలని కోరారు. వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నగంగాధర్ రెడ్డి మృతిపై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.

viveka murder case
viveka murder case

By

Published : Jun 12, 2022, 5:14 PM IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గంగాధర్‌ రెడ్డి మృతిపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆధ్యాత్మిక ధోరణిలో.. 'పుట్టిన వారు చనిపోక తప్పదు' అని విజయసాయి వ్యాఖ్యానించటంలో అర్ధం లేదని అన్నారు. వివేకా కేసులో ఇప్పటి వరకు ముగ్గురు సాక్షులు చనిపోయారని.. మిగిలిన సాక్షులనైనా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్‌ చేశారు.

జులై 4న తన నియోజకవర్గంలో ప్రధాన మంత్రి మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వస్తున్నందున తాను కూడా హాజరు కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే అక్కడికి తాను వెళితే.. శాంతిభద్రతల సమస్య పేరుతో తనపై కుట్రపూరితంగా దొంగ కేసులు పెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. ఐబీతో పాటు సీఆర్పీఎఫ్‌ల నుంచి నివేదిక తీసుకుని రాష్ట్ర పోలీసులు తన పర్యటనకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే హాజరవుతానని చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం తమ పార్టీ అధ్యక్షుడికి ఉంటుందన్న రఘురామ.. ఎంపీగా తనపై అనర్హత వేటు వేసేందుకు మాత్రం నియమావళిని అనుసరించాల్సిందేనని చెప్పారు.

రుణాలు తీసుకోడానికి ఏపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని రఘురామ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం బాండ్లు విడుదల చేసి రూ.8 వేల కోట్లు రుణాలు పొందారని రఘురామ ఆరోపించారు. 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపానం నిషేదం అమలు చేస్తానన్న సీఎం జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆదాయాన్ని పెంచుకోవటం కోసం మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details