మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ (mp raghurama on three capitals), శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించకుంటున్నట్లు శాసనసభలో మంత్రి బుగ్గన చేసిన ప్రసంగం చూస్తే.. అబద్దం చెబుతున్నట్లుగా ఉందన్నారు.
రైతు చట్టాలను రద్దు చేసిన సందర్భంలో ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పారని.. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న భాజపా నేతలపై కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు ఇవ్వటం దారుణమన్నారు. పాదయాత్రకు వచ్చే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రజల మద్దతుతో గెలిచిన మనకు అహంకారం మంచిది కాదని హితవుపలికారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్న రఘురామ.. సోమవారం నుంచి హైకోర్టులో 100 శాతం వాదనలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.