అధికార వైకాపాకు చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన అనుచరులతో విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషనులో హల్‌చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 30 మంది అనుచరులతో వచ్చి గంటకుపైగా వీరంగం చేశారు. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ తదితరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన సమీప బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టలేదంటూ ఆయన స్టేషన్‌లో హడావుడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆయన అనుచరులు స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను లాక్కొని దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..
ట్రిపుల్ రైడింగును ఆపడంతో..
మంగళవారం అర్ధరాత్రి బస్టాండు వద్ద ఉన్న గంగ్రోతి హోటల్ పరిసరాల్లో కృష్ణలంక స్టేషనుకు చెందిన ఎస్‌ఐ మూర్తి తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన మహేష్, నితిన్, కార్తీక్‌లు సినిమా చూసి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్నారు. ఒకే వాహనంపై ముగ్గురు ఉండడాన్ని గమనించిన ఎస్సై వారిని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. తాము సినిమాకు వెళ్లామని, టిఫిన్ చేయడానికి వచ్చామని అంటూ.. తాము ఎంపీ బంధువులమని చెప్పారు. ట్రిపుల్ రైడింగ్ ఎలా చేస్తున్నారంటూ ఎస్సై వారిని మందలించి, ఒకరిపై చేయి చేసుకున్నారు. విచారణ నిమిత్తం ముగ్గురినీ కృష్ణలంక స్టేషన్‌కు తరలించారు.
ఎంపీ బంధువులమని..
స్టేషన్‌కు వెళ్లిన అనంతరం వారిపై ఎస్‌ఐ చేయి చేసుకోవడాన్ని ఓ యువకుడు వీడియో తీసి ఎంపీకి పంపారు. దానిని పరిశీలించిన ఎంపీ సురేష్.. ఎస్‌ఐకి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. దీంతో ఎంపీ సుమారు 20 మంది అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తన బంధువులని చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో మరింత రెచ్చిపోయిన ఆయన ఎస్‌ఐ మూర్తితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న దక్షిణ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కృష్ణలంక సీఐ సత్యానంద్ హుటాహుటిన స్టేషన్‌కు వచ్చి ఎంపీకి సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా.. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.