ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మున్నిపల్ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా - MP Kesineni launches campaign for Vijayawada Municipal Corporation elections

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంపై సీఎం జగన్‌ కక్ష పెట్టుకున్నారనటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలతో వైకాపా పై వ్యతిరేకత ఒక్క విజయవాడకే పరిమితం కాలేదని రాష్ట్రమంతా ప్రజాగ్రహం ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటున్న ఎంపీ కేశినేని నానితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.

mp kesineni nani interview
వీఎంసీ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా

By

Published : Mar 6, 2021, 6:51 AM IST

Updated : Mar 6, 2021, 8:56 AM IST

వీఎంసీ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నారనటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలతో వైకాపాపై వ్యతిరేకత ఒక్క విజయవాడకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతా ప్రజాగ్రహం ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటున్న ఎంపీ కేశినేని నానితో ఈటీవీ-భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ఈటీవీ భారత్: విజయవాడ నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపవకాశాలు ఎలా ఉన్నాయి?

కేశినేని: ఈ ప్రాంతంపై కక్షకట్టినటు వంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నా రాజధాని మారదని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేయటంతో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతాన్ని ఎడారిలా మార్చేశారు. ఇక్కడి నుంచి రాజధాని తరలించి విశాఖలో పెడతామంటున్నారు. విజయవాడ 1953లోనే రాజధాని కావాలి. అప్పుడు ఇక్కడ కమ్యునిస్ట్ ప్రభావం ఎక్కువ ఉందని నాటి ప్రభుత్వం కర్నూలు లో రాజధాని పెట్టింది. అక్కడి నుంచి 56లో హైదరాబాద్ కు తరలించారు. అప్పటి నుంచి 60ఏళ్ల పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా హైదరాబాద్ నగరాభివృద్ధికి కృషి చేశారు. 2014లో రాజధాని లేని రాష్ట్రంగా 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ విడిపోతే, తెలంగాణ 10 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఏర్పడింది. దీంతో పాటు అంతా కలిసి అభివృద్ధి చేసిన ప్రపంచ స్థాయి నగరం హైదరాబాద్ ను వదులుకోవాల్సి వచ్చింది. అన్ని ప్రాంతాలకు సమదూరంలో నడిబొడ్డు, సమృద్ధిగా నీరు, ఇతర వనరులు ఉన్నందుకే చంద్రబాబు విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు పలికారు. ఎన్నికల ముందు నేను ఇక్కడ సొంతిల్లు కట్టుకున్నా, చంద్రబాబుది అద్దిల్లు అంటూ జనానికి మాయమాటలు చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రజల్ని మోసం చేస్తూ రాజధానిని విశాఖకు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇది కక్షసాధింపు కాకమరేంటి? 60-70ఏళ్ల క్రితమే అభివృద్ధి కావాల్సిన ప్రాంతం విజయవాడ. 1980 తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి హైదరాబాద్ లో కూడా లేదు. సినీ, రాజకీయ, పత్రికా రంగాలన్నీ విజయవాడ కేంద్రంగానే నడిచేవి. అలాంటి విజయవాడను కాదని ఇప్పుడు రాజధాని విశాఖ అన్నారు. ఈ ప్రాంతంపై ఎందుకింత కక్ష? ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఓటు రూపంలో బుద్ధి చెప్పనున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ఇప్పటికే డబ్బు, మద్యం ప్రవహిస్తోంది. బెదిరింపులు, మహిళా కార్పొరేటర్ అభ్యర్థులపై దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఇన్ని కుట్రల్లోనూ గట్టిగా పోరాడుతున్నాం. ఈ పరిస్థితుల్లో తెదేపా గెలిస్తే... అమరావతికే కాదు జగన్ పాలనకే రెఫరండం అవుతుంది. మొత్తం 64 డివిజన్లలో 50 డివిజన్ల వరకూ తెదేపా, సీపీఐ కూటమి గెలుచుకోబోతోంది.

ఈటీవీ భారత్: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవసరం లేకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఇదెలా సాధ్యం?

కేశినేని: వైకాపా గెలిస్తే 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టదు. నగరంపై ఆ పార్టీకి అంత చిత్తశుద్ధి లేదు. కేంద్రం నుంచి ఎలాగైనా నిధులు తెచ్చి అభివృద్ధి చెస్తామని ఎంపీగా నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. తెదేపా అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధితో పోల్చితే 21 నెలల్లో 100 రూపాయలు కూడా నగరాభివృద్ధికి వైకాపా ఖర్చు చేయలేదు. కనక దుర్గ ఫ్లైఓవర్ కోసం చంద్రబాబు ధర్నా తలపెడితే ఫ్లై ఓవర్ సాధ్యం కాదంటూ ప్రస్తుత మంత్రి, వైకాపా ఎమ్మెల్యేలు, నాటి ఎంపీ పోటీ ధర్నాలు చేశారు. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆదేశాలతో ఎంపీగా నగరానికి ఎంతో కృషి చేశాం. కేంద్రం నుంచి 480 కోట్లు తెచ్చి దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించాం. బెంజి సర్కిల్ నిర్మాణం చేపట్టాం. విమనాశ్రయాన్ని వెయ్యి కోట్ల తో అభివృద్ది చేశాం. బస్టాండ్ కంటే అధ్వానంగా ఉన్న బ్రిటీష్ కాలం నాటి విమానాశ్రయం తెదేపా అధికారంలోకి వచ్చాకే కొత్త రూపు సంతరించుకుంది. చుక్క నీరు కూడా నగరంలో నిల్వ ఉండకూడదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ద్వారా వరదనీటి కాల్వలకు రూ.400 కోట్లు పైగా నిధులు తెచ్చాం. 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ అసుపత్రి అభివృద్ధి చేశాం. ఇప్పుడదే కోవిడ్ ఆసుపత్రిగా సేవలందిస్తోంది. రూ. 2వేల కోట్లతో సమీపంలోనే ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు చంద్రబాబు సహకారం అందించారు. మిగతా అభివృద్ధి అంతా దాదాపు 6-7వేల కోట్ల రూపాయలు నిధులు విజయవాడ నగరానికి తీసుకొచ్చాం. వైకాపా అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో రాష్ట్రం 60 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఒక్క రోడ్డు గుంత కూడా పూడ్చలేదు. పారిశుద్ధ్య నిర్వహణ పరమ చెత్తగా ఉంది. నగరాభివృద్ధి జగన్మోహన్ రెడ్డి వల్ల కాదనేది ఇక్కడ సుస్పష్టం. మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని గుడిని మింగేస్తున్నారని 15 నెలల నుంచి చెప్తున్నాం. ఏసీబీని, సీఐడీని పంపి మంత్రిని కాపాడేందుకు చిరుద్యోగుల్ని బలిచేశారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి దుర్గుగుడితో పాటు ఇంకా ఇతర ఆలయాలపై ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో సీబీఐ విచారణ జరిపించాలి. అప్పుడే దేవాదాయ శాఖ మంత్రి ఎంత తినేశాడనే మొత్తం లెక్క తేలుతుంది. ఎన్ని ఆలయాల సంపద దోచాడో బయటపడుతుంది.

ఈటీవీ భారత్: ప్రజలకు మెరుగైన సంక్షేమం అందిస్తున్నామనే ధీమా ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతోంది కదా?

కేశినేని:సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ చెప్పుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఈతకాయంత ఇచ్చి తాటికాయంత లాక్కుంటున్నారని భావిస్తున్నారు. 5 వేలో పది వేలో ఇచ్చి, ఏటా లక్షరూపాయల పైగా ప్రతి కుటుంబం మీద భారం మోపుతున్నారు. చీమంత ఇచ్చి కొండంత చెప్పుకుంటున్నారు. వైకాపా చెప్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంతా బూటకమే. ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్రమంతా ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో మహిళలు కోపంగా ఉన్నారు. రూ.300 - 400వచ్చే విద్యుత్ బిల్లు ఇప్పుడు రూ.1200 వస్తోంది. ఆటో డ్రైవర్లపై నాడు నెలకోసారి రూ.200-300 అపరాధ రుసుము పడేది. ఇప్పుడు వారానికి రూ.4వేలు వేస్తున్నారు. రోజు రూ.300-400కు అద్దెకు ఆటో తెచ్చుకునే డ్రైవర్లు వెయ్యి రూపాయల వరకూ తోలుకుంటారు. వారానికి 7 వేలు సంపాదించుకునే ఆటో కార్మికుడు 4వేలు అపరాధ రుసుము కింద కడితే ఎలా బతకాలి? రకరకాల కారణాలతో పింఛన్లు, రేషన్ లో కోత పెడుతున్నారు. అమ్మ ఒడి కాస్తా.. నాన్న జేబుకు తడి అవుతోందని మహిళలే చెప్తున్నారు. మద్య నిషేధం అని అధికారంలోకి వచ్చి రూ.100 రూపాయలు ఉండే మద్యం ధరను రూ.300 చేశారు. అది కూడా చీప్ లిక్కర్ ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలా ఏ రంగం తీసుకున్నా ప్రతిఒక్కరి నడ్డి విరిచేస్తున్నారు.

ఈటీవీ భారత్: ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పన్నుల భారం తగ్గిస్తామని చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మీకు ఇదెలా సాధ్యం?

కేశినేని: విజయవాడ నగరాన్నే ఉదాహరణగా తీసుకుంటే నిత్యవసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గ్యాస్, ఇంధనం ధరలు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మనకే అధికం. మధ్య, దిగువ తరగతి వాళ్లు ఆర్థిక భారంతో అప్పులపాలైన తరుణంలో పన్నుల భారం మోపుతానంటున్నారు. ప్రజలు ఏరకంగా కడతారనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. సొంతింటి వాళ్లు ఈ పన్ను భారం మోయలేక అద్దెలు పెంచేస్తారు. అద్దె కట్టే మధ్య తరగతి వాళ్లూ ఆ భారం మోయాల్సి వస్తుంది. ప్రజల్ని ఏరకంగానూ బతకనీయరా? గత 5 ఏళ్లు విజయవాడ నగరపాలక సంస్థ మా చేతుల్లోనే ఉంది. ఒక్క రూపాయి అదనంగా పన్నుభారం, నీటి ఛార్జీలు పెంచలేదు. 2014లో అధికారంలోకి వచ్చే సరికి 6 నెలలు మున్సిపల్ ఉద్యోగుల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించటంతో పాటు 010పద్దు అందుబాటులోకి తీసుకొచ్చాం. కార్పొరేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించే ఈ విధానం వల్ల ఏటా రూ.180కోట్లు చొప్పున 5ఏళ్లలో రూ.900కోట్లు ఆదా చేశాం. నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆ నిధులు సరిపోతాయి. స్వయంప్రతిపత్తి కలిగిన నగరానికి వచ్చే పన్నులు సక్రమంగా అమలు చేసుకుంటే ఆదాయం వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పెంచిన పన్నుల విధానం విజయవాడలో అమలు కానివ్వం. గెలిచి తొలి తిర్మానంలోనే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాం.

ఈటీవీ భారత్: పార్టీలో అంతర్గత విభేదాలపై స్పందన ఏంటి?

కేశినేని: 4ఓట్లు లేని వాళ్లు కూడా విభేదిస్తామంటుంటే నేనేం చెప్పాలి. మీడియాకు కూడా అలాంటి మసాలా కావాలి. టీఆర్పీ రేటింగుల కోసం వాటిని కొన్ని ఛానళ్లు పెద్దగా చూపిస్తున్నాయి. విభేదాలు ఎక్కడుండవు, ఒక కుటుంబంలో నలుగురు సభ్యులంటే వారి మధ్య మనస్పర్థలు సహజం. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రజాస్వామ్య స్ఫూర్తితో మాట్లాడేవే మీడియాకు వివాదాలుగా కనిపిస్తున్నాయి. మేం వాటిని విభేదాలుగా పరిగణించట్లేదు. వీటిని పరిష్కరించేందుకు అధిష్ఠానం ఉంటుంది. వారి ఆదేశాలకు అనుగుణంగా సర్దుకెళ్తుంటాం. నగరానికి ఎవరు మేయర్ గా కావాలో ప్రజలకు ఓ అవగాహన ఉంది. ఆ ఫీడ్ బ్యాక్ వివిధ రూపాల్లో పార్టీ అధిష్ఠానానికి వెళ్లింది. అందుకనుగుణంగానే ప్రకటించాల్సిన సమయంలో మేయర్ అభ్యర్థిని ప్రకటించారు. ప్రతీ అభ్యర్థికీ పార్టీ విధానాలు చెప్పే రైట్ ఉంటుంది.

ఇదీ చూడండి:

నగరపాలక సంస్థల్లో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

Last Updated : Mar 6, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details