రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు చేసిన ప్రయోజనాలపై బహిరంగ చర్చకు రావాలని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ చేశారు. భాజపా ఒక్కటే నిజమైన సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తోందని తెలిపారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు కేవలం అలంకార ప్రాయమైన పదవులను బీసీ, ఎస్సీ వర్గాలకు ఇచ్చాయని విమర్శించారు.
ఆయా తరగతులకు ప్రభుత్వం ద్వారా చెందాల్సిన ప్రయోజనాన్ని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నిధులు మళ్లించి తాము పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూరితే అది ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోయినా ప్రధాని నరేంద్రమోదీ వైద్య సీట్లలో 27 శాతం బీసీ వర్గాలకు, పది శాతం ఈబీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.