MP Vs MLA: కృష్ణా జిల్లా మచిలీపట్నం వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ వల్లభనేని బాలసౌరి పర్యటనను వైకాపాకే చెందిన నగర కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం మచిలీపట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇనకుదురు పేటలోని ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరటంతో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడకు వెళ్లారు. ఎంపీ వస్తున్న సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్‌కు ఎంపీ రావటం సరికాదన్నారు. ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచురులతో మోహరించి ఎంపీని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగటంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్పొరేటర్ వర్గీయులను అక్కడినుంచి తరలించారు.
తనను అడ్డుకోవడంపై ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న బాలశౌరి.. ఎంపీ సుజనాతో కలిసి నాని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. సీఎంను, పార్టీని, ప్రభుత్వాన్ని సుజనా తిడితే పేర్ని నాని స్పందించరని.. కొనకళ్లతో వారానికోసారైనా మాట్లాడకపోతే నానికి నిద్రపట్టదని బాలశౌరి ఎద్దేవా చేశారు. బందర్ పేర్ని నాని అడ్డా కాదన్న ఎంపీ బాలశౌరి.. ఇకపై తాను బందర్‌లోనే ఉంటానని కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. 'ఎవరేం చేస్తారో చూస్తా.. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా' అంటూ ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ను అవినీతిపరుడని తిట్టిన వ్యక్తితో కలిసి పేర్ని నాని పలు కార్యక్రమాల్లో పాల్గొనటమేమిటని ప్రశ్నించారు.