ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘ఉపాధి’లో మెటీరియల్‌ పనులకూ కాసుల కష్టాలు... కేంద్రం బకాయిలు రూ.700 కోట్ల

జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) కింద ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.700 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌లో చేపట్టిన పనులకూ డబ్బుల కష్టాలు తప్పడం లేదు.

narega fonds paid from Center govt
జాతీయ ఉపాధి హామీ పథకం

By

Published : Aug 2, 2021, 7:29 AM IST

రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) కింద మెటీరియల్‌ కాంపోనెంట్‌లో చేపట్టిన పనులకూ కాసుల కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు చేసిన పనులకు రూ.700 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నా కేంద్ర ప్రభుత్వం మెటీరియల్‌ నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రభావం నిర్మాణ పనులపై పడుతుండటంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.1,000 కోట్లు అందించాలని తాజాగా ప్రతిపాదించారు. కేంద్రం నిధులు విడుదల చేశాక రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. నరేగాలో ఉపాధి కూలీలు చేసే మొత్తం పని విలువలో 2/3 వంతు మొత్తాన్ని మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తుంటుంది. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తుంటారు.

ఇదే క్రమంలో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి మెటీరియల్‌ కాంపోనెంట్‌లో రూ.3,267 కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేసి గ్రామాల్లో పలు పనులు చేయిస్తున్నారు. వీటిలో అత్యధికంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా, గ్రామ ఆరోగ్య కేంద్రం వంటి భవన నిర్మాణాలు ఉన్నాయి. ఈ పనులపై ఇప్పటికే నిధుల బదిలీ ఉత్తర్వులు (ఎఫ్‌టీవో) సీఎఫ్‌ఎంఎస్‌కు పంపినవి, ఇంకా ఎఫ్‌టీవోలు ఆన్‌లైన్‌ చేయాల్సినవి కలిపి రూ.700 కోట్లకుపైగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మెటీరియల్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నాలుగు విడతలుగా విడుదల చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొదటి త్రైమాసిక నిధులు విడుదల చేయలేదు. దీంతో అనేకచోట్ల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు తాత్కాలికంగా నిలిపి వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తే పూర్తయిన పనులకు నిధులు విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details