ప్రమాదమనగానే పరుగున వచ్చారు. కొవిడ్ బాధితులు అన్నా కూడా వారిని భుజాన వేసుకుని కాపాడి పునర్జన్మ ప్రసాదించారు. ఎందరో ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేసి కాపాడారు.
పరుగున వచ్చారు... పునర్జన్మ ప్రసాదించారు! - విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్ ప్రమాదం వార్తలు
విధి నిర్వహణ ముందు కరోనా వైరస్‌ను కాలికింద ధూలిలా చూశారు. ప్రాణాలకు తెగించి ఇతర ప్రాణాలను కాపాడారు. 20 మందికి పునర్జన్మనిచ్చారు. విజయవాడ అగ్నిప్రమాద ఘటనలో బాధితులను కాపాడేందుకు అగ్నిమాపక, పోలీసు సిబ్బంది చేసిన సాహసమిది.
విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మందికిపైగా కరోనా బాధితులను అగ్నిమాపక, పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడం, వారు నిమిషాల్లోనే అక్కడకు చేరుకోవటంతో భారీ ప్రాణనష్టం తప్పింది. వారు అంత వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టకపోతే మొత్తం 31 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఐదు ఫైరింజన్లు, 40మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వచ్చేవరకు వారికి అక్కడ కొవిడ్ రోగులున్న విషయం తెలియదు. ఆ తర్వాత తెలిసినా వారంతా ధైర్యంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని జిల్లా అగ్నిమాపక అధికారి అభినందించారు. కరోనా బాధితులను కాపాడిన అనంతరం ఆ సిబ్బందిని అధికారులు ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించారు.