MONKEYPOX: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్.. భారత్‌కూ విస్తరించి.. తొలికేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో మంకీ పాక్స్ కేసు కలకలం స్పష్టించింది. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలో చిన్నారి శరీరంపై దద్దుర్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ కేసుగా వైద్యుల అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారి నమూనాలను సేకరించిన అధికారులు.. పుణె ల్యాబ్‌కు పంపిచారు. అనంతరం చిన్నారి కుటుంబాన్ని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
మంకీపాక్స్ గురించి: మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం, శారీరకంగా కలవడం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.