ముఖ్యమంత్రి జగన్కు ప్రతిపక్షాలతో పాటు ప్రజల మీదా కోపం ఉందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానం రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల నడ్డి విరిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. పేదలకోసం తెదేపా నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చీప్ లిక్కర్ కంటే దారుణమైన బ్రాండ్లు తెచ్చి పేదలను ఆరోగ్యపరంగా, ఆర్థికంగాను ఇబ్బంది పెడుతున్నారని సత్యనారాయణరాజు మండిపడ్డారు.
ప్రపంచం మెచ్చే రాజధాని అమరావతి నిర్మాణానికి తూట్లు పొడిచారన్నారు. పన్నుల భారం మోపి అభివృద్ధి చేస్తామనటం సరికాదని హితవు పలికారు. జగన్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం మంత్రులు ఒకరి తర్వాత మరొకరు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. అధికారం ఇచ్చింది మంచి పాలన ఇస్తారని కానీ విపక్షాల గొంతు నొక్కమని కాదని మంతెన స్పష్టం చేశారు. పాలన వదిలేసి ప్రతిపక్షాలపై దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరలో ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి రాకపోగా ఏ అభివృద్ది కార్యక్రమమూ చేపట్టలేదని విమర్శించారు. చేతనైతే ప్రతిపక్షాల సలహాలు తీసుకుని రాష్ట్రాభివృద్ధి చేయాలి కానీ దాడులు సరికాదని సత్యనారాయణరాజు హితవు పలికారు.