అమరావతి రైతులకు వ్యతిరేకంగా రూ.5కోట్ల ప్రజల సొమ్మును న్యాయవాదులకు చెల్లించి మరీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న జగన్ ప్రభుత్వం.., పోలవరంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి నిలదీశారు. అలా చేస్తే తమ కేసులపై కేంద్రం దృష్టిసారిస్తుందనే భయం పాలకుల్లో ఉందా అని దుయ్యబట్టారు.
"ఎత్తు తగ్గించకుండా పోలవరం పూర్తిచేస్తే పురుషోత్తమపట్నం ద్వారా గ్రావిటీతో విశాఖనగరానికి తాగునీరు అందించవచ్చు. పోలవరం ఎత్తుతగ్గించమని చెబుతున్న ప్రభుత్వం పైప్‌లైను ద్వారా విశాఖనగరానికి తాగునీరు అందించేందుకు ఎందుకు డీపీఆర్ సిద్ధంచేస్తోంది?. పోలవరం ఎత్తుపై మంత్రి ఒకలా.., ముఖ్యమంత్రి మరోలా చెప్పటం చూస్తుంటే ఇద్దరూ కలిసి ప్రజలను మరోసారి మోసగిస్తున్నారన్నది సుస్పష్టం. అమరావతిని ఇప్పటికే నాశనం చేసి తాజాగా పోలవరాన్ని కూడా కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. పోలవరాన్ని కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అలాంటిది నిర్మాణ వ్యయంలో రూ.22 వేలకోట్లకు పైగా కోతపెడితే జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదు." అని ప్రశ్నించారు.
కేంద్రం ఎగ్గొట్టిన నష్టాన్ని రాష్ట్ర ప్రజలపై మోపి ప్రాజెక్టు పూర్తిచేస్తామంటే ఉపేక్షించేదిలేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.