చిత్తూరులో వైకాపా ఆదేశాలతో అధికారులే సంతకాలు ఫోర్జరీ చేసి తెదేపా అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియపై సమగ్ర విచారణ తర్వాతే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఎవరు చేశారు? అనే కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ దాఖలు, ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలనే ఆదేశాలను పట్టించుకోలేదన్నారు.
'ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న పార్టీని ప్రజలు సహించరు'
మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు, పోలీసుల సాయంతో సాధించుకునే గెలుపు ప్రజలిచ్చిన విజయం కాదనే విషయం సజ్జల తెలుసుకోవాలని తెలుగురైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ సలహాదారు కాస్తా పెద్దవాలంటీర్లా మారారని విమర్శించారు. రౌడీమూకలను వెంట పెట్టుకుని తిరిగే వైకాపా నేతలు పట్టణాలకు నాయకులు కాలేరన్నారు. కడప, చిత్తూరులో సాగిన బలవంతపు ఏకగ్రీవాలు మిగిలిన జిల్లాల్లో కొనసాగవని తెలుసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అధికారపార్టీపై ప్రజలు విశ్వాసం చూపారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్