వైకాపా నేతలు పోలవరం కాలువ గట్లను సైతం వదలకుండా తవ్వేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా దోపిడీని జాతీయ హరిత ట్రిబ్యునల్ బట్టబయలు చేసిందన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో ట్రిబ్యునల్ తీర్పుతో స్పష్టమైందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో మైనింగ్ నిలుపుదల చేయకపోగా అక్రమ తవ్వకాలను జగన్ ప్రభుత్వం మరింత ప్రొత్సహిస్తోందని అశోక్ బాబు మండిపడ్డారు.
ఎన్జీటీ తీర్పు ఆధారంగా వాస్తవాలు తేలే వరకు మైనింగ్ నిలుపదల చేయటం ప్రభుత్వ నైతిక బాధ్యత అన్నారు. మట్టి, ఇసుక, బాక్సైట్, లేటరైట్, సిలికాన్ ఇలా దేనినీ వదలకుండా ప్రకృతి వనరులను వైకాపా నేతలు దోచేస్తున్నారని అశోక్బాబు విమర్శించారు. న్యాయస్థానాలను ఆశ్రయించైనా..మైనింగ్ మాఫియాను అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా దుశ్చర్యలపై ఆధారాలతో సహా కేంద్రానికి, ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తామని అశోక్ బాబు వెల్లడించారు.