ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ASHOKBABU: ఇప్పటికీ పోరాటం చేయకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు: అశోక్​బాబు - ఉద్యోగ సంఘాల పీఆర్సీ వార్తలు

ఉద్యోగ సంఘాల అలసత్వాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు (MLC Ashok babu) దుయ్యబట్టారు. ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఉన్న దూరం మరే రాష్ట్రంలోనూ లేదన్న ఆయన.. ఎక్కడా లేనంత నిరాదరణ ఏపీ ఉద్యోగుల పట్ల ఉందని విమర్శించారు.

ఇప్పటికీ పోరాటం చేయకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
ఇప్పటికీ పోరాటం చేయకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

By

Published : Nov 13, 2021, 3:19 PM IST

ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ పోరాటం చేయకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్సీ అశోక్ బాబు (MLC Ashok babu) వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల అలసత్వాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని దుయ్యబట్టారు.

"ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి ఉన్న దూరం మరే రాష్ట్రంలోనూ లేదు. ఎక్కడా లేనంత నిరాదరణ ఏపీ ఉద్యోగుల పట్ల ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల పేరుతో సామాన్య ఉద్యోగుల్ని ఇంకెన్నాళ్లు ఇబ్బంది పెడతారు. పీఆర్సీ (PRC) నివేదిక ఉద్యోగ సంఘాలకు ఇచ్చేందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి ? నివేదిక ఇచ్చాకే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం (Joint Staff Council Meeting) పెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయకుండా.. ఇంకా ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అర్థం కావట్లేదు. ఎయిడెడ్ (aided) కోసం పోలీసుల లాఠీకి ఎదురొడ్డి విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే, ఉద్యోగ సంఘాలు ఎందుకు బయటకు వచ్చి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేకపోతున్నాయి. ప్రభుత్వ మోచేతి నీళ్లు తాగాలనే వైఖరి నేతలకు ఎంతమాత్రం మంచిది కాదు. భయపడితే ఏదీ సాధించలేరు. మూడేళ్ల పాటు మూడు డీఏలు (DA) మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, పీఆర్సీపై ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు. ఆర్ధిక మంత్రి అప్పుల మంత్రిగా దిల్లీలో కూర్చున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉంటుంది" అని అశోక్ బాబు వ్యాఖ్యనించారు.

ప్రభుత్వానికి డెడ్​లైన్..

పీఆర్సీని (PRC) ఈ నెలాఖరులోగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సమయమిచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో...28న ఉమ్మడి సమావేశం తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని సంఘాల నాయకులు తెలిపారు. ఎన్నికలకు ముందు ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉద్యోగులంతా ఉద్యమానికి దిగే పరిస్థితి తీసుకురావొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

శనివారం నాటి సమావేశంలో పీఆర్సీపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదని..పెండింగ్‌ బిల్లులు (Pending Bills) ఖచ్చితంగా ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేదని ఏపీ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (Bandi Srinivas rao) అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సమస్యలపైనా రెండు ఐకాసలు సుదీర్ఘంగా చర్చించాయని పేర్కొన్నారు. రెండు ఐకాసలు కలిపి సుమారుగా 200 సంఘాలు ఉన్నాయన్న ఆయన.. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులందరికీ.. నిరాశే మిగిలిందని అవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27లోపు ఏపీ ఎన్జీవో (APNGO) సంఘం.. ఈనెల 28న ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతిలో సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

సీఎస్​కు మెమోరాండం..

ఉమ్మడి సమావేశాల అనంతరం సీఎస్‌కు (CS) మెమోరాండం ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. "మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా" అని బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాటలతో కాలయాపనే తప్ప, తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా మేనిఫెస్టో చూసి చాలా ఆశగా ఉన్నామని, ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని భావించామని అన్నారు. కానీ.. నిరాశే ఎదురైందని అన్నారు. ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా ? అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

EMPLOYEES UNION: ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా..? ఈ నెలాఖరే డెడ్ లైన్

ABOUT THE AUTHOR

...view details