పన్నుల రూపంలో వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని.. కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (APSDC)కి మళ్లిస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యాజ్యం అపరిష్కృతంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. రిజాయిండర్‌కుమరికొంత సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ కోరారు. ఇప్పటికే మూడు వారాలు సమయం ఇచ్చామన్న ధర్మాసనం.. చివరి అవకాశం ఇదేనంటూ స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
పన్నుల రూపంలో వస్తున్న ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమచేయకుండా నేరుగా ఏపీఎస్డీసీ (APSDC)కు మళ్లిస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ వేశారు. ఏపీఎస్డీసీ చట్టంలోని సెక్షన్ 12 ( 1 ), ( 4 ), ( 5 ) ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఏపీఎస్డీసీ తీసుకునే రూ. 25 వేల కోట్లు రుణానికి విశాఖలోని ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టేందుకు వీలు కల్పిస్తు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.