MLA ROJA ON INDIGO STAFF: ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడేలా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకోవడం సరికాదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సాంకేతిక లోపం ఉన్నా బెంగళూరుకు మళ్లించి.. డోర్లు తీయకుండా తమను మానసికంగా ఆవేదనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెంగళూరు మళ్లించిన విషయం తెలిసిందే. ఆ విమానంలో రోజాతో పాటు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
బెంగళూరులో విమానం ల్యాండైన అనంతరం ఈ ఘటనపై రోజా వీడియోలు విడుదల చేశారు. ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ''వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్ చేశామని సిబ్బంది చెప్పారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో దిగాక సాంకేతిక సమస్య అని తెలిసింది. విమానంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు రూ. 5,000 కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం'' అని రోజా అన్నారు.