ఈసీ నోటీసులపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన MLA Raja Singh Response: కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన నోటీసులపై.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాను ఎలాంటి తప్పూ మాట్లాడలేదని.. ఈసీకి వివరణ ఇస్తానని తెలిపారు. అఖిలేష్‌యాదవ్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది..? యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది..? అనే విషయాలనే ప్రస్తావించానని వివరించారు.
అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హాయంలో హిందువులు, రైతుల భూములను కబ్జాలు చేశారని ఆరోపించారు. కబ్జాలు చేసిన స్థలాల్లో యోగీ ప్రభుత్వం పేదలకు లక్షల ఇళ్లు కట్టించిందని.. ఈ విషయాన్నే మాట్లాడానని పేర్కొన్నారు. యోగీ ఆదిత్యానాథ్ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో రాజస్థాన్‌లోని ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం తలపెట్టినట్టు తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చాక ఈసీకి వివరణ ఇస్తానని స్పష్టం చేశారు.
నేనేమీ తప్పు మాట్లాడలేదు..
"కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నా ఆఫీస్‌కు నోటీసులు పంపించారు. ఓటర్లను బెదిరించారు.. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీస్‌లో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇస్తా.. నేను ఏమీ తప్పు మాట్లాడలేదు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హాయంలో యూపీలో గుండాల రాజ్యం నడిచేది. హిందువులు, రైతుల భూములను కబ్జాలు చేశారు. యోగీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుండాల రాజ్యాన్ని అంతమెందించారు. కబ్జాలు చేసిన స్థలాల్లో యోగీ ప్రభుత్వం పేదలకు లక్షల ఇళ్లు కట్టించింది. ఈ అంశంపైనే వ్యాఖ్యలు చేశా. యోగీ మరోసారి అధికారంలోకి రావొద్దని కుట్ర చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది..? యోగీ అధికారంలోకి వస్తే ఏమవుతుందని వివరించా. యోగీ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఉజ్జయిని వెళ్తున్నా. రాజస్థాన్ ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం పెట్టుకున్నాను. పూజా కార్యక్రమం ముగించుకుని వచ్చాక అడ్వకేట్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తా." - రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే
సంబంధిత కథనం..