Ministers Unhappy: దాదాపు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండి, అధినేత మనోభావాలకు అనుగుణంగా అన్ని విధాలుగా వ్యవహరించిన తమకు కొనసాగింపు ఎందుకు లభించలేదన్న ఆవేదన మరికొందరు మాజీ మంత్రుల్లోనూ కనిపిస్తోంది. పునర్‌వ్యవస్థీకరణలో ఒకరిద్దరు మాత్రమే కొనసాగుతారని, మిగిలిన వారంతా కొత్తవారే ఉంటారని మొదటి నుంచీ చెప్పి మానసికంగా అందరినీ సిద్ధం చేసి.. చివరికి తమను మాత్రమే తొలగించటం ఏమిటన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. సమీకరణాల పేరుతో తమను కట్టడి చేసి.. ఏ ప్రాతిపదికన ఏకంగా 11 మంది పాతవారిని కొనసాగించారో అర్థం కావటం లేదని తమ సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, అన్నా రాంబాబు, పార్థసారథి, ఉదయభాను సహా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా నాయకుల అనుచరులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బుజ్జగింపులు:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బుజ్జగింపులు పర్వం కొనసాగుతోంది. విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల వెళ్లారు. ఆయనతో పాటు.. శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డి కూడా ఉన్నారు.
తీవ్ర అసంతృప్తిలో బాలినేని.. మొన్నటిదాకా మంత్రి పదవిలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈసారి కొనసాగించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను తప్పించడంతోపాటు తమ జిల్లా నుంచి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంపై నిన్నటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు విడతలుగా బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా ఆయన శాంతించలేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
విజయవాడలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి.. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కార్యాచరణపై నాగార్జునరెడ్డి చర్చించారు. అలాగేకరణం బలరాం కూడా మరోసారి బాలినేనిని కలిశారు.
బాలినేనికి మద్దతుగా సంతమాగులూరు మండల పరిషత్ అధ్యక్ష పదవికి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి కొటారి రామచంద్రరావు రాజీనామా సమర్పించారు. అలాగే ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే కోవలో బాలినేనికి మద్దతుగా ఒంగోలు మేయర్, కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బాలినేని అభిమానులు అన్నారు. ఆయనకు పదవి లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 43 మంది వైకాపా కార్పొరేటర్లు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధమైనట్లు కార్పొరేట్లకు తెలిపారు. బాలినేని రాజీనామా చేస్తే అందరం రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఒంగోలు జడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏ నిర్ణయానికైనా సిద్ధం: బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రిపదవి రాకపోవటం అన్యాయమని ఒంగోలు మేయర్ సుజాత విమర్శించారు. ఆయనకు మద్దతుగా తాను మేయర్ పదవికి రాజీనామా చేసానని తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్ని అర్హతలు ఉన్న సీనియర్ నేత అన్న ఆమె.. పదవి ఎందుకు ఇవ్వలేదో సీఎం జగనే చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నేత ఏ నిర్ణయం తీసుకున్నా.. తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. జిల్లాలో వైకాపాని గెలిపించటంలో కీలక పాత్ర పోషించారన్నారు. 11 మంది పాతవారికి మంత్రి పదవి ఇచ్చి బాలినేనికి ఇవ్వకపోవడం కలచివేస్తుందని సుజాత అన్నారు.
సుచరిత బాటలోనే అనుచరులు :మరో తాజా మాజీమంత్రి సుచరిత మాత్రం శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆమె వర్గీయులు పలువురు అదే బాటలో పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. బాలినేనిని మెత్తబరిచేందుకు సజ్జల సహా పలువురు శతవిధాలా ప్రయత్నించగా.. సుచరిత విషయంలో మాత్రం పార్టీ ప్రాంతీయ బాధ్యుడైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఒక్కరే విఫలయత్నం చేశారు. పాత మంత్రివర్గంలో కీలకశాఖ బాధ్యతలు చూసిన ఓ మాజీమంత్రి రాజీనామా పత్రం సమర్పించిన రోజే విజయవాడలో ఇల్లు ఖాళీ చేసి నేరుగా చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ సీఎం సన్నిహిత బంధువుతో తన ఆవేదన పంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘జగన్‌కు సూయిసైడ్ స్క్వాడ్ వంటి మమ్మల్ని ఎందుకు తొలగించారో అర్థం కావటం లేదని’ ఇద్దరు మాజీలు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంపై నిత్యం దారుణమైన విమర్శలతో విరుచుకుపడే ఓ తాజా మాజీ పేరు ఆఖరి నిమిషం వరకు కొనసాగింపు జాబితాలో ఉందని, ఓ సలహాదారు జోక్యంతో తొలగించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీన్ని తాజా మాజీ నమ్మనట్లు కనిపిస్తున్నా.. ఆయన వర్గీయులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
అన్నా రాంబాబు అనుచరుల నిరసన.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాలేదనంటూ కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో చేశారు. అలాగే కంభంలో ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు.
పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి..విజయవాడలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ వచ్చారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న పార్థసారథితో ఆయన చర్చించారు. పార్థసారథికి మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అనుచరులు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
ఇదీ చదవండి: