Ministers on PRC: చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందనే విషయం ఉద్యోగులు గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు మొండి పట్టుదలకు పోతే ఉపయోగం లేదని పేర్కొన్నారు. తాము చర్చలకు రమ్మంటే అలుసుగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ కూడా కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని వివరించారు. మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చామని వెల్లడించారు. జీతాలు పెరుగుతాయా.. తగ్గుతాయా అనేది పే స్లిప్ చూసుకోవాలని సూచించారు. ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు సహా రాష్ట్రంలోని ఏ ఉద్యోగి ముందుకొచ్చినా మాట్లాడేందుకు సిద్ధమని తెలిపారు. ఉద్యోగులకు సమస్య అంటే ప్రభుత్వానికి సమస్య ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు.
ఘర్షణ వాతావరణం వద్దు.. చర్చలకు రావాలని కోరుతున్నామని వెల్లడించారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని తెలిపారు. ఉద్యోగ సంఘాలు కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురు చూడమని, ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు: సజ్జల
ఇవాళ కూడా ఉద్యోగులతో చర్చల కోసం వచ్చామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని చెప్పారు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై సజ్జల మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఘర్షణకు దారితీయకూడదని కమిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి వేతనాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆందోళన, సంఘాల నేతల మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. హెచ్‌ఆర్‌ఏ సవరణ అంశాన్ని సంఘాల నేతలు ప్రస్తావించడం లేదని వివరించారు. చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేదన్నారు. వేతనాల బిల్లులు చేయకుండా డీడీవోలను అడ్డుకుంటున్నారని తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులపై నష్టం జరిగిందని భావిస్తే చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయన్నారు. ఇప్పుడు మాట మార్చి మరోలా వ్యవహరించడం సరికాదని సజ్జల వ్యాఖ్యానించారు.
నాలుగో రోజులుగా కమిటీ ఎదురు చూపు