ప్రభుత్వ విధానాలను ఉద్యోగులు ప్రశ్నించవద్దని, జీతభత్యాల వంటి సమస్యలుంటేనే అడగాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల కమిటీ సూచించింది. పీఆర్సీ పెండింగ్ అంశాలు, ఉద్యోగుల డిమాండ్లపై బుధవారం సచివాలయంలో కమిటీ వారితో సమావేశమైంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజల కోసం విధానాలు తీసుకొస్తామని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యులైనందున వాటిని ప్రశ్నించకూడదని పేర్కొన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు అన్ని విభాగాలకు వర్తింప చేయాలని, ఆరోగ్యశ్రీ కార్డుల్లాగే ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని ఆసుపత్రుల్లో అనుమతించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. జీపీఎఫ్, పీఎఫ్ రుణాలను సకాలంలో ఇవ్వాలని విన్నవించారు.
15 రోజులకోసారి చర్చిద్దామన్నారు..:"ప్రభుత్వ విధానాల్లో ఉద్యోగులు జోక్యం చేసుకోవద్దని మంత్రుల కమిటీ ప్రతినిధులు కోరారు. ప్రజల కోసం విధానాలు తీసుకొస్తున్నామని, ప్రజలు దీవిస్తారా.. లేదా అన్నది తర్వాత అని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు అయినందున ప్రశ్నించొద్దన్నారు. ఆర్థికేతర అంశాలపై 15 రోజులకోసారి చర్చించి, ఆర్థిక అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ, డీఏ బకాయిల అమలుకు సరైన హామీ ఇవ్వాలని కోరాం. బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రణాళిక ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగి చనిపోతే ఆ విభాగంలోనే కారుణ్య నియామకాలు చేపట్టాలని విన్నవించాం. కొత్త జిల్లాలకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కోరాం. క్రమశిక్షణ చర్యల పేరుతో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరాం." -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి
పెళ్లికి అడిగితే బారసాలకూ రావడం లేదు:"అమ్మాయి పెళ్లి కోసం జీపీఎఫ్ రుణాలకు దరఖాస్తు చేస్తే మనవరాలి బారసాలకు కూడా రావడం లేదు. సాంకేతిక కారణాలతోనే జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరుకు జీపీఎఫ్ మొత్తాలను ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన 2,500 మందికి ప్రొబెషన్ ఖరారు చేయలేదు. కలెక్టర్లకు చెప్పి చేయించాలని కోరాం. ఆరోగ్య శాఖలో 54 డిమాండ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బందికి సవరించిన పేస్కేల్స్ ఇవ్వాలని చెప్పాం." -బండి శ్రీనివాసరావు, ఛైర్మన్, ఏపీ ఐకాస