కాలుష్య నియంత్రణలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 124 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కలిసి రోజుకు 6900 టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయని వాటిలో 44 శాతం పొడి వ్యర్థాలు, 56 శాతం తడి వ్యర్థాలు ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో 89 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీ) ఉన్నాయని చెప్పారు. ఘన, ద్రవరూప వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలని సూచించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతిరోజూ కూల్చివేతల వల్ల సుమారు 495 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 46,000 టీపీఏ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో ఆసుపత్రులు, ల్యాబ్‌లలో బయో మెడికల్ వ్యర్థాలను అన్ని జాగ్రత్తలతో నాశనం చేయాలన్నారు. రాష్ట్రంలో పదివేలకు పైగా ఉన్న జీవ వైద్య వ్యర్థాల నిర్వహణను సమీక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని 16 స్పాంజ్ ఐరన్ యూనిట్లు, 31 ఫెర్రో అల్లాయ్ యూనిట్లు, 73 వంటనూనెల యూనిట్ల పనితీరు, నగరిలోని 89 అద్దకం యూనిట్లకు సంబంధించిన వ్యర్థాల నిర్వహణ, పది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 94 రొయ్యల ప్రాససింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాల ప్రాసెసింగ్ పైన నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.