కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, జగనన్న నేత నేస్తం, చేయూత పథకాల కింద అర్హత ఉండి లబ్ధిపొందలేక పోయిన వారు రేపటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. విజయవాడలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన... ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 19 వేల మందికి ఈ పథకాలను వర్తింపజేసినట్లు వెల్లడించారు. పాలకులం కాదు-సేవకులం నినాదంతో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేస్తోందన్నారు. కరోనా విపత్తును సాకుగా చూపించి పేదలకు పథకాలను తగ్గించే మనస్తత్వం తమ ప్రభుత్వానికి లేదన్నారు.