Minister Venugopal on crop holiday: రైతులు క్రాప్ హాలిడే అని మాట్లాడటం దురదృష్టకరమని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రైతులకు విత్తు నుంచి విత్తనం వరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోందని.. కొందరు కావాలనే ఈ అంశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తానూ వ్యవసాయదారుడినేనని ఆ ప్రాంతానికి చెందినవాడిగా రైతుల కష్టాలు తనకూ తెలుసన్నారు. క్రాప్ హాలిడే గురించి మాట్లాడిన రైతులు ఇప్పుడు దాన్ని విరమించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆన్లైన్ టికెట్ల గురించి రాష్ట్రంలో వివాదం ఏమీ లేదని.. థియేటర్ యాజమాన్యాలు, ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కొన్ని సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వల్లే కొంతమేర ఇబ్బంది తలెత్తిందని.. అయితే ప్రస్తుతం ఆ సమస్యలేవీ లేవన్నారు. సినిమా షూటింగ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందని.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగానే షూటింగ్ చేసుకోవచ్చన్నారు. ఇంకా ఎక్కువ సినిమా చిత్రీకరణలు జరిగేలా సినీ పరిశ్రమ పెద్దలో మాట్లాడే ప్రయత్నం చేస్తామన్నారు.