రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నంత మాత్రాన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎస్ఈసీ వ్యవహారంపై ఆవేదనతో మంత్రులు నిజాలు మాట్లాడుతుంటే అతనికి బాధ అనిపిస్తోందని విజయవాడలో అన్నారు. ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న వ్యక్తి... పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా పనిచేయాలన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో రూ.కోట్లు ఖర్చు పెట్టి నిమ్మగడ్డ ఏ విధంగా లాయర్లను పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా న్యాయవాదులను పెట్టుకోలేకపోతోందని అన్నారు.
"గతంలో ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తామంటే ప్రభుత్వం సహకరించబోదు. మా ప్రభుత్వం ప్రజల తరపున మాట్లాడుతుంది."