రాష్ట్రంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా పూజలు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని.. ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకోవచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ప్రభుత్వం.. వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు. చవితి ఉత్సవాలపై.. భాజపా మత రాజకీయాలు చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం, మతం రంగు పూయడం సరైన పద్ధతి కాదన్నారు.
గణేశ్ ఉత్సవాల నిర్వహణపై భాజపా నేతల రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ఆయన చర్చించారు. భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భాజపా నేతలకు దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనల్లో మార్పులు చేయించాలన్నారు.