ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకంపై కమిటీ: వెల్లంపల్లి

కడప జిల్లాలోని బ్రంహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాద పరిష్కారం కోసం మఠాధిపతులతో కమిటీని నియమించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పీఠాధిపతి ఎంపికపై అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని చర్చించి వీలైనంత త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. దేవాదాయ శాఖలోని ఆర్జేసీ స్ధాయి ఉన్నతాధికారిని విచారణకు నియమిస్తామన్నారు. మఠాధిపతులు, భక్తులు ఎవరైనా వారి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కమిటీ సహా అధికారికి తెలియజేయవచ్చన్నారు.

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకంపై కమిటీ: వెల్లంపల్లి
బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకంపై కమిటీ: వెల్లంపల్లి

By

Published : Jun 13, 2021, 4:15 PM IST

Updated : Jun 13, 2021, 4:39 PM IST

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకంపై కమిటీ

దేవాదాయ శాఖ నిబంధనలు, సాంప్రదాయం ప్రకారమే బ్రంహ్మంగారి మఠం పీఠాధిపతిని కొద్ది రోజుల్లోనే ఎంపిక చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అన్నారు. అప్పటివరకు విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ సమన్వయం పాటించాలని, పీఠం గౌరవం మర్యాదలను పెంపొందించేలా అందరూ సహకరించాలని కోరారు. మఠం పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత మఠాధిపతి కొవిడ్ చనిపోయిన అనంతరం తదుపరి వారసులు ఎవరు అనే విషయమై వివాదం నెలకొందని మంత్రి తెలిపారు. తదుపరి వారసుడు ఎవరనే విషయమై చనిపోయిన మఠాధిపతి ముందుగానే వీలునామా రాశారని చెబుతున్నారని అన్నారు. చనిపోయిన మఠాధిపతి ఇద్దరి భార్యల వారసులూ పీఠాధిపతి స్థానానికి పోటీ పడుతున్నారని, దీంతో మఠాధిపతిగా ఎవరు నియమించాలనే విషయమై వివాదం నెలకొందన్నారు. మఠానికి వారసులు ఎవరు అనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం వీలునామా రాసిన అనంతరం 90 రోజుల్లోపు ధార్మిక పరిషత్​కు పంపాల్సి ఉంటుందని, ఇప్పటివరకు ఏ వీలునామా, ధార్మిక పరిషత్ లేదా కమిషనర్ కార్యాలయానికి అందలేదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సామరస్యంగా వివాదాన్ని పరిష్కరిస్తామని.. అందరూ సహకరించాలని మంత్రి కోరారు.

పీఠాధిపతి నియామకంపై కమిటీని నియమించి వివాదాన్ని పరిష్కరిస్తాం. కమిటీలో మఠాధిపతులను నియమించి చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తాం. కమిటీ సమావేశమై పూర్తి వివరాలు విచారించాక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం వచ్చేవరకు అసిస్టెంట్ కమిషనర్ మఠం వ్యవహారాలు చూస్తారు. వివాద పరిష్కారానికి హిందూ సంఘాలందరితో సలహాలు తీసుకుంటాం. వివాద పరిష్కారానికి ఆర్జేసీ స్థాయి అధికారిని నియమిస్తాం. అందరి సూచనలు తీసుకుని ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తుంది. - వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి

Last Updated : Jun 13, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details