డీఎస్సీ-2018 ఎస్జీటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి విద్యాశాఖ మంత్రి సురేశ్ శుభవార్త తెలిపారు. నియామకాల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. 3524 పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ఇప్పటికే 2203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన 1321మంది అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తవుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల ఈనెల 24న పరిశీలిస్తామని తెలిపారు. ఖాళీల పూర్తి సమాచారం అదేరోజున అభ్యర్థులకు అందిస్తామని మంత్రి వెల్లడించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని...ఈనెల 25, 26న కౌన్సిలింగ్, అదేరోజు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఎస్జీటీల పోస్టులు భర్తీ అయ్యాక కోర్టు ఆదేశాల ప్రకారం మిగిలిన పోస్టుల భర్తీ చేస్తామని సురేశ్ తెలిపారు.
స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. డీఎస్సీ 2018 నియామకాలు చివరి అంకానికి వచ్చాయని వ్యాఖ్యనించారు. 80 శాతం మందికి నియామక పత్రాలు అందించామని వెల్లలించారు. ఈనెల 28లోపు నియామక ప్రక్రియ పూర్తిచేసి అర్హులకు నియామక పత్రాలు అదిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తిచేశాక డీఎస్సీ-2020 నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ- 2020 త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. టెట్ పరీక్ష విధివిధానాలు ఇప్పటికే రూపొందించామని...టెట్ సిలబస్‌ను ఆధునీకరించి పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.