పది, ఇంటర్ ఫలితాలను వారం రోజుల్లో వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 2021-22 అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించి, తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టిన ఏపీ అభ్యసన పరివర్తన పథకంతో విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గత పదేళ్లలో రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టు అమలు చేయలేదని పేర్కొన్నారు.
ఛాయరతన్ అధ్యక్షతన కమిటీ
పది, ఇంటరు ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ ఛాయరతన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈమె పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పది, ఇంటరు ఫలితాల్లో సీబీఎస్‌ఈ విధానం పాటించడమా? లేదంటే తెలంగాణ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను పాటించాలా? అనే దానిపై కమిటీ సిఫార్సు చేయనుంది.
పంచాయతీరాజ్ బడుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
పంచాయతీరాజ్ బడుల పర్యవేక్షణకు కొత్తగా 666 మండల విద్యాధికారులు (ఎంఈవో), 49 డిప్యూటీ డీఈవోలు, 13 డీఈవో పోస్టులను సృష్టించాలని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ప్రతాపరెడ్డి ప్రతిపాదించారు. కమిషనరేట్‌లో శనివారం ఉపాధ్యాయసంఘాలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై దాదాపుగా అన్ని సంఘాలు అంగీకారం తెలిపాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్లు సంచాలకుడు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలు పెండింగ్‌లో ఉన్నందున ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇలా నియమితులయ్యే వారు మండల, జిల్లా పరిషత్తు పాఠశాలలను మాత్రమే పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వారానికోసారి బడికి..
జులై ఒకటి నుంచి ఉపాధ్యాయులు వారానికోసారి బడికి వెళ్లాలని అధికారులు సూచించారు. 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలపై వర్క్‌షీట్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు వర్క్‌షీట్లను గ్రామ సచివాలయ విద్యా సహాయ కార్యదర్శులకు అప్పగిస్తే వారు పిల్లలకు అందిస్తారు. విద్యార్థులు పూర్తి చేసిన వాటిని తిరిగి తీసుకొచ్చి, ఉపాధ్యాయులకు అప్పగిస్తారు. ఆగస్టు నుంచి బడులు తెరిచే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా