ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Aided Schools: 'ప్రైవేటు వ్యక్తులు నడపలేకపోతున్నందునే ప్రభుత్వం తీసుకుంటోంది' - సురేశ్ తాజా వార్తలు

పాఠశాలలు, కళాశాలలకు ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ప్రభుత్వ గ్రాంట్‌తో నడుపుతున్నా..ఆశించిన ఫలితాలు రావటం లేవన్నారు. ఎక్కడైనా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని..సంస్కరణలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాలయాలు మూతపడవు
గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాలయాలు మూతపడవు

By

Published : Sep 27, 2021, 6:46 PM IST

Updated : Sep 28, 2021, 2:59 AM IST

ప్రభుత్వ గ్రాంటుతో (Government Grants) ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు, పాఠశాలలు నడుపుతున్పప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Minister suresh) తెలిపారు. ఎక్కడైనా నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వ గ్రాంటుతో నడుస్తున్న పాఠశాలలు (Aided Schools) , కళాశాలలు 2,200కు పైగా ఉన్నాయన్నారు. సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. జీవో నంబర్ 52 (G.No: 52) ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు గ్రాంట్‌ పొందుతున్న ప్రైవేటు సంస్థల ఆస్తులు ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


"ప్రభుత్వ పథకాలు అమలుచేస్తున్నా ఫలితాలు రావడం లేదు. జీవో 52 ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. గ్రాంట్లు పొందే సంస్థల ఆస్తులు ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం. కమిటీ సిఫార్సుల మేరకు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గ్రాంట్ వదులుకోవడం, ప్రైవేట్‌గా నడుపుకోవడం, ప్రభుత్వానికి అప్పగించడం. 137 డిగ్రీ కళాశాలల్లో 125 ప్రభుత్వానికి అప్పగించారు. 103 జూనియర్ కళాశాలలను సిబ్బందితో సహా ప్రభుత్వానికి ఇచ్చారు. 1,276 పాఠశాలలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించారు. అన్‌ఎయిడెడ్ పాఠశాలలు ఏవీ మూతపడవు. ప్రైవేటు వ్యక్తులు మూసివేస్తే ప్రభుత్వమే నడుపుతుంది. ప్రైవేట్‌ వ్యక్తులు నడపలేకపోవడం వల్లే ప్రభుత్వం తీసుకుంటోంది. "-ఆదిమూలపు సురేశ్‌, విద్యాశాఖ మంత్రి

గ్రాంట్ ఇన్ ఎయిడ్ (Grant in aid) కళాశాలల అధ్యాపకుల బదిలీలు కూడా జరుగుతాయని సురేశ్ స్పష్టం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి అధ్యాపకులు వచ్చినా కాంట్రాక్టు లెక్చరర్లకు ఇబ్బందులు కలగనీయమన్నారు. యూనివర్సిటీ పరిధిలో వారికి వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వందల కోట్ల రూపాయల నిధులు వృథా అయ్యాయని తెలిపారు. గతంలో ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను నీరుగార్చారన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లు, కళాశాలలు ఎక్కడా మూతపడవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నామన్నారు. రాజకీయ దురుద్దేశాలతో, ఆస్తులు దక్కించుకోవాలనే దురుద్దేశాలతో ఈ సంస్కరణలు తీసుకురాలేదని వెల్లడించారు. శాస్త్రీయంగా కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు ఏడాదికి రూ. 600 కోట్లు అవుతోందని.. పాఠశాలలకు, కళాశాలలకు కలిపి ఏటా రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు నడపలేక పోతున్నారనే ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు.

అలా చేస్తే చర్యలు..

ఏ పాఠశాలనూ ఏకపక్షంగా మూసివేసేందుకు అనుమతి లేదని మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు. ఏకపక్షంగా మూసివేసే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. మాంటిస్సోరీ సంస్థకు ప్రభుత్వం తరఫున రీజాయిండర్​ జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఒత్తిడి చేయటం లేదు..

1991 తర్వాత ఏ ఒక్క సంస్థకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ హోదా ఇవ్వలేదని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర తెలిపారు. 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎక్కువగా లేనందునే ప్రభుత్వం తరపున గ్రాంట్లు ఇచ్చి నడిపిందన్నారు. ఇప్పుడు కిలోమీటర్​కు ఒక పాఠశాల, నియోజక వర్గానికి ఓ డిగ్రీ కళాశాల ఉందన్నారు. ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాలల్లో సంప్రదాయ కోర్సులు మాత్రమే ఉన్నందున ఆ కళాశాలలకు డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ఒకే కళాశాలలో ప్రైవేటు, ఎయిడెడ్ రెండు వ్యవస్థలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై యజమాన్యాలపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

GULAB EFFECT: మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు తక్షణ సాయం: సీఎం జగన్​

Last Updated : Sep 28, 2021, 2:59 AM IST

ABOUT THE AUTHOR

...view details