ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్(pension) విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని(Minister Perni Nani ) తెలిపారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మంత్రి సమావేశమయ్యారు. ప్రజల సమస్యలు విని పరిష్కార మార్గాలను చూపారు.
అయ్యా! నా పేరు మదివాడ బాపన రావు(73). మాది వలందపాలెం. ఇటీవల నా వృద్ధాప్య పింఛన్‌ను తొలగించారు. ఎందుకు తొలగించారని సచివాలయ సబ్బందిని ప్రశ్నిస్తే... నా కుమారుడు రేషన్ కార్డులో ఉన్నాడని.. అతడు ఆదాయపన్ను చెల్లిస్తూ... ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కారణంగా పింఛన్ తొలగించామన్నారు. దీనికి మీరే పరిష్కారం చూపించాలి. - మాదివాడ బాపనరావు, బాధితుడు
మీ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం రాగనే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తే బాగుండేదని మంత్రి పేర్ని నాని (Minister Perni Nani )అన్నారు. రేషన్ కార్డులో పేరు తొలగించని కారణంగానే పింఛన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అంచనా ఉంటే... అందులో దాదాపు 4.31 కోట్ల మంది రేషన్ కార్డులో ఉన్నారని, ఆ రేషన్ కార్డులలో అర్హత లేని వారు కూడా ఉన్నట్లుగా అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్న వర్గాల వారు, పన్నులు చెల్లించే వారు రేషన్ కార్డులో ఉన్నట్లు అనుమానం రావటంతో ప్రభుత్వం అనర్హుల తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో భాగంగా కొన్ని నిబంధనల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసిందన్నారు. గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20లక్షలు, పట్టణాల్లో వార్షికాదాయం రూ.144లక్షలు ఉన్న వారు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులని తెలిపారు.