సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ద్వారా ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు మార్గం సుగమమైందని (Online Cinema Tickets in ap) మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు థియేటర్ యజమానుల ఇష్టానుసారం టికెట్ల విక్రయాలు జరిగేవని.., ప్రజలను దోచుకునే పరిస్థితిని నియంత్రించేందుకే ఆన్‌లైన్ విధానం తీసుకొచ్చామని వివరించారు. బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలోని 1100 థియేటర్లలో ఆన్‌లైన్‌లో టికెట్ విక్రయాలు చేపడతామని స్పష్టం చేశారు. సినిమా విడుదల సమయంలో టికెట్ల ధర బ్లాక్‌లో రూ.200 నుంచి రూ.1000 వరకు విక్రయించే విధానం గతంలో ఉండేదని.., అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని.., చారిటీస్ కోసం మాత్రమే ఈ షోలకు అనుమతి ఇస్తామన్నారు.
స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజహితం కోసం పనిచేస్తున్న సంస్థలకే బెనిఫిట్ షోలకు అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ థియేటర్ యాజమాన్యాన్ని సంప్రదించి బెనిఫిట్ షో కోసం జిల్లా జేసీకి దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం వచ్చినప్పటి నుంచి రోజుకు నాలుగు షోలకే అనుమతి ఉందని, అవి కాకుండా మిగతావన్నీ దొంగ ఆటలేనన్నారు. తామేమీ కొత్తగా అదనపు షోలను నిషేధించడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసి ఇలాంటి ఆటలు కొనసాగించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం మేరకు... ఆంధ్రప్రదేశ్ సినిమాల (క్రమబద్ధీకరణ) చట్టానికి సవరణ బిల్లును శాసనసభ బుధవారం ఆమోదించింది. ఈ సందర్భంగా శాసనసభలో, ఆ తర్వాత సచివాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని పలు వ్యాఖ్యలు చేశారు. ‘తమకు ఎదురు ఉండకూడదు, ఏం చేసినా అంతా అనుకూలంగా ఉండాలి, చట్టాలు తమను ఆపలేవనే రీతిలో సినిమా పరిశ్రమలో కొందరి పోకడలు ఉన్నాయి. సినిమాపై పేద, మధ్యతరగతి వర్గాల బలహీనతను ఎక్కువమంది సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 6-8 ఆటలు వేసి, ఇష్టారాజ్యంగా టికెట్‌కు రూ.300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు’ అన్నారు. ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి లేకపోవడంపై సినీ పరిశ్రమ నుంచి ఏమైనా ప్రతిపాదన ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘సినిమా నిర్మాతల సంఘం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞాపన చేశారు. అది సీఎం వద్ద ఉంది. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోంది. పెంచితే ప్రజలపై భారం పడుతుందా? అనే సమీక్ష జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.
మాకు పెద్ద.. చిన్న నటులనే తేడా లేదు
పెద్ద సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే అదనపు షోలకు అనుమతిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘జగన్ ప్రభుత్వానికి పెద్ద నటుడు, చిన్న నటుడు, సినిమా పెద్దదా? చిన్నదా? అన్న తేడా లేదు. ప్రేక్షకుల కోణం, థియేటర్లపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికులను దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తాం. పెద్ద నటుడు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ప్రభుత్వం దగ్గర వారికి ప్రత్యేక స్థానం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.