రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక పాలసీని... పకడ్బందీగా అమలు చేయాలని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మైనింగ్ ప్రాజెక్ట్‌లపై విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ ఎం.మధుసూదన్ రెడ్డిలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని చెక్ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇసుక నిర్ధేశించిన ప్రాంతాలకు తప్ప బయటకు వెళ్లడానికి వీలు లేదని చెప్పారు. ప్రతి లారీకి జీపీఎస్ పరికరాలను అమర్చడం, డోర్ డెలివరీ ద్వారా ఇసుక తరలి వెళ్లేలా చూడడం తప్పనిసరి అన్నారు. హెవీ మినరల్ బీచ్ శాండ్ ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు లీజ్‌లకు గ్రాంట్ ఆర్డర్లు, ఇతర ఏరియాలకు ఏపీఎండీసీ ద్వారా రిజర్వేషన్ అనుమతులను పొందటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
బైరటీస్, గ్రానైట్‌పై ఆరా
కడప జిల్లా మంగంపేట బైరటీస్ గనుల కోసం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు, భూ యజమానులకు చెల్లించాల్సిన పరిహారాన్ని కలెక్టర్ ద్వారా జాప్యం లేకుండా అందచేయాలని సూచించారు. బైరటీస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లాలోని తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్ నిల్వలున్న భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తున్నారనే సమాచారం మేరకు సదరు జిల్లా కలెక్టర్‌కు మైనింగ్ శాఖ నుంచి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. మైనింగ్ భూములను ఇతర అవసరాలకు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌కు తొందరగా టెండర్లు పిలిచి రైసింగ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని మంత్రి సూచించారు. ఖాళీగా వున్న గనుల్లో ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.