ప్రభుత్వ రంగ సంస్థగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో తన కార్యక్రమాలను విస్తరిస్తోందని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఖనిజ వెలికితీతకు ఏపీఎండీసీ శ్రీకారం చుట్టిందని ఆయన వెల్లడించారు. సచివాలయంలో ఏపీఎండీసీ వ్యవహారాలపై ఆ సంస్థ చైర్పర్సన్ షమీమ్ అస్లామ్‌తో కలిసి మంత్రి సమీక్షనిర్వహించారు. సులియారీ కోల్ మైన్స్‌లో ఏపీఎండీసీ తవ్వకాలను ప్రారంభించిందని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మదియా కోల్ మైన్‌లో కూడా పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు.
బైరటీస్ లాంటి ఖనిజ వెలికితీత కార్యక్రమాల ద్వారా ఏపీఎండీసీ అంతర్జాతీయ మార్కెట్లో కీలక స్థానంలో నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో గ్రానైట్, బీచ్ శాండ్, సిలికా శాండ్, కాల్సైట్, బాల్ క్లే వంటి ఖనిజ వనరులను వెలికితీయడం ద్వారా సంస్థ తన సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందని వివరించారు. మైనింగ్ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలను చేపడతున్నట్లు తెలిపారు. కడప జిల్లా మంగంపేటలోని బెరైటీస్ మైనింగ్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఏపీఎండీసీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు సంస్థ ఎండీ వెంకట్ రెడ్డి వివరించారు. కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించేందుకు 72 హ్యాబిటేషన్లలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తోందన్నారు. మైనింగ్ కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.