ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీడియాకు దూరంగా ఉండాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి అప్పీల్ - సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు ధర్మాసనం ముందు మంత్రి పెద్దిరెడ్డి అప్పీల్

మీడియాకు దూరంగా ఉండాలన్న ఎస్​ఈసీ ఉత్తర్వులపై సింగిల్‌ జడ్జి తీర్పును..హైకోర్టు ధర్మాసనం ముందు మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌ చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని మంత్రి తరఫున న్యాయవాది కోరగా..ఇవాళ విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇక ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై పెద్దిరెడ్డి మరోసారి సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చినట్లు తెలుస్తోంది.

మీడియాకు దూరంగా ఉండాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి అప్పీల్
మీడియాకు దూరంగా ఉండాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి అప్పీల్

By

Published : Feb 9, 2021, 5:06 AM IST

పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సమర్థించడాన్ని సవాలు చేస్తూ... పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఆయన తరఫు న్యాయవాది ప్రశాంత్‌..అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై మంగళవారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ..గతంలో ఎస్​ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి...మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరిస్తూ ఎస్​ఈసీ విధించిన పరిమితి సహేతుకంగా ఉందని స్పష్టంచేశారు. ఆ విషయంలో జోక్యానికి నిరాకరించారు. మంత్రి ఇంటికే పరిమితం కావాలంటూ ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేశారు.

దీనిపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను నిరాకరించడమేనన్నారు. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం..ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైన చోట అభ్యర్థి గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి వెంటనే ప్రకటించాలన్నారు. చట్ట నిబంధనలను పాటించాలని మీడియా ముఖంగా అధికారులను కోరానని..ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా తనను ఆపుతూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వరాదని డీజీపీని ఎస్ఈసీ ఆదేశించారు. ఈ నిర్ణయం తన హక్కులకు భంగం కలిగించిందని మంత్రి పెద్దిరెడ్డి నోటీసిచ్చినట్లు సమాచారం. గతంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణపై నిమ్మగడ్డ రమేశ్‌... గవర్నర్‌కు లేఖ రాశారు. దానిపై మంత్రులిద్దరూ గతంలోనే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

ఇదీచదవండి

అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరు

ABOUT THE AUTHOR

...view details