Minister Peddi Reddy Review On Mining: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బరైటీస్, బొగ్గు, హెవీ బీచ్ శాండ్, ఐరన్ ఓర్, బాల్ క్లే, సిలికాశాండ్, గ్రానైట్ తదితర ఖనిజాలకు సంబంధించిన ఆపరేషన్స్‌పై అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో కీలకమైన ఖనిజాల వెలికితీతలో ఏపీఏండీసీ చక్కటి ప్రగతిని కనబరుస్తోందని, ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గుగనులను దక్కించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని మంత్రికి అధికారులు వివరించారు. ప్రాజెక్ట్‌ల వారీగా చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. గత ఏడాది కన్నా మైనింగ్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏపీఎండీసీ మైనింగ్ కార్యక్రమాల పరిధిని విస్తృతం చేసుకుంటోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థగా ఏపీఎండీసీ రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల మైనింగ్‌లో చురుకైన పాత్ర పోషించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మైనింగ్ కార్యక్రమాల లక్ష్యాలను సాధించేలా చూడాలన్నారు.