జూన్ 8 నుంచి వంద రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్వచ్ఛ శంఖారావం ద్వారా సర్పంచులు, ప్రజాప్రతినిధులతో సన్నాహాలు మొదలుపెట్టినట్టు ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొదించటంతో పాటు అంటు వ్యాధుల నివారణ లక్ష్యంగా కార్యక్రమం చేపట్టామన్నారు.
ఇందుకోసం రూ. 1312 కోట్ల మేర 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వంద రోజుల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే సర్పంచులను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తడిచెత్త, పొడి చెత్త సేకరణ కూడా వేర్వేరుగా చేపట్టాలని సూచించామన్నారు. ప్రతి గ్రామంలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ పెట్టాలంటే సాధ్యం కాదని అందుకే వాటిని వేరు చేసి సమీప మున్సిపాలిటీలకు ఈ ఘన వ్యర్ధాలను అందించాలని నిర్ణయిం తీసుకున్నామన్నారు.