Srinivas Goud Murder Plan: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్రణాళిక వేసిన కేసులో... కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు ఆయుధాల్ని అడవుల్లో దాచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మద్యం వ్యాపారంలో తమను ఆర్థికంగా దెబ్బ తీసినందుకు కక్ష పెంచుకున్న నిందితులు.. శ్రీనివాస్ గౌడ్‌తో పాటు అతడి అనుచరుడు గులామ్ హైదర్‌ను అంత మొందించేందుకు నిర్ణయం తీసుకున్నారని నిందితుల రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కుట్ర పన్నిన నిందితులు.. రెండు ఆయుధాల్ని అడవుల్లో దాచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అడవుల్లో ఆయుధాలు...
హత్య కోసం కత్తులతోపాటు రెండు రౌండ్లతో కూడిన 9 ఎంఎం క్యాలిబర్ పిస్టల్, 6 రౌండ్లతో కూడిన దేశవాళీ రివాల్వర్‌ను నిందితులు సమకూర్చుకున్నారు. సుచిత్రలోని లాడ్జి వద్ద గులామ్ హైదర్‌పై హత్యాయత్నం విఫలం కావడం.. నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య పోలీసులకు చిక్కడంతో మిగిలిన నిందితులు ఆయుధాల్ని కవరులో పెట్టి హైదరాబాద్ శివార్లలోని అడవుల్లో దాచారని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులను తమ కస్టడీకి కోరుతూ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.