Minister Meruga on Jagananna Videshi Vidya Deevena: రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పూర్తిగా కొత్త పథకమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికీ, విదేశీ విద్యా దీవెనకి ఎలాంటి పోలికలూ లేవన్నారు. ఈ అంశంపై తెదేపా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మాట వాస్తవమేనని.. కానీ ప్రస్తుతం ఆ పథకంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టిందన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారినీ అర్హులుగా చేశామన్నారు. పథకానికి పేరు మార్చి దాన్ని అమలు చేసే దుస్థితిలో వైకాపా ప్రభుత్వం లేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే అంబేడ్కర్ పేరు తొలగించారంటూ తెదేపా ఆరోపణలు చేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.
అసలేమిటీ ఈ పథకం..విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు విదేశీ విద్య పథకాన్ని రాష్ట్రప్రభుత్వం మళ్లీ అమల్లోకి తీసుకురానుంది. ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పేరుతో దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ విద్య పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, ఇతర సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణ పేరుతో దాన్ని నిలిపేసింది. పథకాన్ని అమలు చేయాలని గత మూడేళ్లుగా వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొంది. టాప్ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తికర స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో పథకానికి అర్హత సాధించి విదేశాల్లో చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.