కాలుష్య నియంత్రణ మండలి విస్తరణలో భాగంగా విజయవాడలో ప్రాంతీయ, జోనల్ కార్యాలయాలు, ప్రయోగశాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను నిరంతరం తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రకృతికి హాని కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాన్ని 1976లో ఏర్పాటు చేయగా.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన జోనల్ కార్యాలయాన్ని 2000లో ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. అయితే అప్పటి నుంచి అవి అద్దె భవనాల్లోనే కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 22.57కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాలు నిర్మించుకోవడం సంతోషదాయకమన్నారు.