తెలంగాణలో పెట్టుబడులపై అంతర్జాతీయ కంపెనీలు, యాజమాన్యాలు ఎలాంటి భావనతో ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్ గురించి తెలుసు.. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి అంతగా తెలియదు. కాబట్టి 2014, 2015లలో మేము చేసిన పర్యటనలన్నీ తెలంగాణ అనే కొత్త రాష్ట్రం గురించి, రాష్ట్రం విధానాల గురించి.. ముఖ్యంగా ఐటీ విధానం, పారిశ్రామిక విధానంతో పాటు అనేక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పారిశ్రామిక వేత్తల కోసం 'స్వీయ ధ్రువీకరణ'.. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. 15 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 16వ రోజు లీగల్‌గా వెళ్లొచ్చనే విధానాలు ఎక్కడ కూడా లేవు. విప్లవాత్మక విధానాలు ఏవైతే తీసుకొచ్చామో.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బాగా వాడుకున్నాం. ఇటీవల దావోస్, యూకే పర్యటనల్లో తెలంగాణ అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాం. గత 8 ఏళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతిలిచ్చిన రాష్ట్రంగా... వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. పలు దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి తెలంగాణ చేరుకుంది. మన విజయాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ప్రస్తావించాం. వారు మన విజయాలను చూసి అబ్బురపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు.. ప్రస్తుతం మూడింతలు వృద్ధి సాధించి రూ. లక్షా 83 వేల కోట్లకు చేరుకుంది.
హైదరాబాద్ అంటేనే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్‌లో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు అమలు చేయబోతోంది?
ఐటీ రంగంలో కేవలం పెద్ద కంపెనీలను మాత్రమే ఆకర్షించడం కాకుండా కొత్త రకమైన ఆవిష్కరణలు, అంకురాలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టీ-హబ్, వీ-హబ్, టీఎస్ఐసీ లాంటి కొత్త కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం. తెలంగాణ వచ్చే నాటికి 400 స్టార్టప్స్ ఉంటే.. ఇప్పుడు 2వేల పైచిలుకు స్టార్టప్స్ హైదరాబాద్‌లో ఉన్నాయి. మా ఆలోచన, ఆశయం ఇంకా పెద్దగా ఉంది. అదేంటంటే.. 10వేల పైచిలుకు స్టార్టప్‌లకు హైదరాబాద్ కేంద్రం కావాలి. ఇక్కడి నుంచి యూనికాన్స్ రావాలి. ఇక్కడి నుంచి లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించే సంస్థలు రావాలనేది ఒక ఆశయం. దానికనుగుణంగా ఈ టీ-హబ్, వీ-హబ్ పెట్టినా.. ఆ క్రమంలో ఈకోసిస్టమ్ నిర్మాణానికి దోహదపడుతున్నాయి. భారతదేశ వృద్ధి రేటు చూస్తే పోయిన సంవత్సరం సగటున 17 శాతం.. కానీ తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతం. దేశంలో ఏడాదిలో నాలుగున్నర లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే.. లక్షన్నర ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే.. అంటే మూడో వంతు ఇక్కడి వారే ఉద్యోగాలు సాధించారు. లైఫ్ సైన్సెస్ చూస్తే ప్రపంచానికి అందించే వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్‌లో తయారవుతున్నాయి అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం 9 బిలియన్ డోసులు తయారు చేస్తున్నాం. దానిని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఐటీ, లైఫ్ సైన్సెస్ మాత్రమే కాదు.. ఏరో స్పేస్, ఏవియేషన్‌లో రాబోతున్న అవకాశాలను కూడా అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర అన్ని రంగాలకు సంబంధించి కూడా మంచి విధానాలను అవలంభిస్తున్నాం.
ఫార్మాసిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభం ఉంటుంది, కేటాయింపులు ఎప్పుడు జరగనున్నాయి?
అతి త్వరలో ఉంటుంది. ఇప్పటికే ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ 95 శాతం పూర్తయింది. కొన్ని కోర్టు వ్యాజ్యాలు అవీ ఇవీ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తాం. ఫార్మాసిటీ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత గలిగిన ప్రాజెక్టుగా రూపాంతరం చెందబోతోంది. కొవిడ్ వల్ల తెలంగాణ శక్తి సామర్థ్యాలు ఏమిటని ప్రపంచం మొత్తం తెలిసింది. కాబట్టి మనం ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఏర్పడబోతోంది. ప్రపంచంలోని పెట్టుబడుదారులందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాలుష్యం అనేదే లేకుండా ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో దీనిని రూపొందిస్తాం. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజలు, ప్రజాప్రతినిధులు అపోహలు వదిలి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ ఆవిర్భవించి 8 ఏళ్లు అవుతోంది. మీరు కూడా తెలంగాణ కోసం కోసం కలలు కన్నారు. ప్రస్తుతం బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నాం. ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది?
నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాల ప్రాతిపదకనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కావాలి. స్వయం పాలనతో కూడిన తెలంగాణ తప్పకుండా బంగారు తెలంగాణ అవుతుందనే లక్ష్యంతో ముందుకు పోయాం. నీటి రంగంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని అద్వితీయ విజయాలను సాధించింది తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం రూపంలో కట్టినా, ఇంటింటికి మిషన్ భగీరథ రూపంలో ఇచ్చినా, మిషన్ కాకతీయ పథకంలో 20 వేల పైచిలుకు చెరువులను బాగుచేసినా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్వితీయ విజయాలు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించని ఘనమైన విజయాలు కేసీఆర్ నాయకత్వంలో సాధించాం. నీటి విషయంలో కొంత అసంతృప్తి ఎక్కడంటే.. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి పంపకాలపై అసంతృప్తి ఉంది. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811టీఎంసీల వాటా ఉండేది. అందులో మనం మొదటి నుంచి చేస్తున్న వాదన ఏమటంటే.. మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల కోసం కృష్ణాబేసిన్‌లో 575 టీఎంసీలు కావాలని.. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌కు సూచించాలని .. కేంద్రాన్ని ఎప్పట్నుంచో కోరుతున్నాం. వాళ్లు పెడచెవిన పెట్టడం.. పంపకాలు చేయాల్సిన వారు చేయకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ విషయంలో అటువైపు ఏపీకి కూడా కొంత అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో ఎవరినైనా అనాల్సి వస్తే.. కేవలం కేంద్రం నిర్లిప్తత వల్లే ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. అది కూడా పూర్తయి ఉంటే నీటి విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చేవి. అయినప్పటికే వ్యవసాయం విషయంలో సంతృప్తి ఉంది. తెలంగాణ ఎంత పంట పండిస్తోందంటే కేంద్ర ప్రభుత్వమే మేం ఈ ధాన్యాన్ని కొనలేం అనే స్థాయిలో ఉంది.
నిధుల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం. ఆంధ్రతో కలిసి ఉన్నప్పుడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే. 1969లో ఉద్యమం జరుగుతున్నపుడు కూడా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అంతే. మిగులు బడ్జెట్‌తో ఉన్న ఈ రాష్ట్రం.. ఇవాళ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోనే నాలుగవ ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ రాష్ట్రం చేరుకుంది. పురోగతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
నియామకాల విషయానికొస్తే ప్రైవేటు రంగంలో.. ఒక ఐటీ రంగంలోనే గత ఎనిమిదేళ్లలో ప్రత్యక్షంగా కొత్తగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు.. ఇతర రంగాలు చూస్తే దాదాపు 17లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగినం. మొత్తంగా చూస్తే దాదాపు 20 లక్షల పైచిలుకు ఉద్యోగాలు పరిశ్రమలు, ఐటీ రంగంలో సృష్టించగలిగాం. అదే విధంగా ప్రభుత్వం రంగంలో లక్షా 32 వేల ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేశాం. మరొక 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మొత్తంగా ఏ శీర్షికన తెలంగాణ ఉద్యమం సాగిందో.. అన్నింట్లోనూ అద్భుత విజయాలు సాధించాం. బంగారు తెలంగాణ వైపు మన ప్రస్థానం కొనసాగుతోంది.
ఈ 8 ఏళ్లలో ఆ వర్గానికి ఇది చేయలేదు.. అది చేస్తే బాగుంటుందని ఏమైనా అనిపించిందా?
అట్లా అని ఏం లేదు. తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న దశలో సమ్మెట పోటు లాంటి దెబ్బ పెద్ద నోట్ల రద్దు. ఆనాడు వారు మాకేదో చెప్తే మేం సమర్థించాం. కానీ దాని వల్ల ఏం ఉపయోగం లేదు. పెద్ద నోట్ల రద్దుతో పాటు కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. కొవిడ్ కంటే కూడా కేంద్రం అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాలు కోలుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం చూపెడుతున్న సవతి తల్లి ప్రేమ చాలా గర్హనీయం, దుర్మార్గం, అరాచకం. ఇతర ప్రభుత్వాలు 25 ఏళ్లలో చేసే పనిని 8 ఏళ్లలో చేశామని గర్వంగా చెప్పొచ్చు.
2019 ఎన్నికలపుడు ఇచ్చిన హామీలపై ప్రజల్లో అసంతృప్తి లేదంటారా?
కచ్చితంగా కొంత ఉంది. కొత్తగా 57 ఏళ్లు ఉన్నవారికి ఆసరా పింఛన్లు ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ భృతి, ఇళ్ల విషయం చెప్పాం. ఇంటి స్థలం ఉన్న వారికి రుణాలు ఇస్తామని చెప్పాం. రుణమాఫీ గురించి చెప్పాలి. ఇప్పటికే రెండు దశల్లో రూ.22 వేల కోట్లు వెచ్చించాం. ఇప్పటివరకు రూ.50 వేలలోపు రుణాలను మాఫీ చేశాం. మిగతా వాటిని కూడా మాపీ చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది. ఈ కొవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చినట్లు కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్‌లు అప్పడే తెరాసపై దాడిని పెంచాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కూడా మాదే అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
రాహుల్‌గాంధీ వరంగల్‌లో మాట్లాడితే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. 70 ఏళ్ల నుంచి ఏం చేశారు. మేం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అని భాజపా నేతలు అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా.. వాళ్లు అధికారంలో లేరా? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది ఎవరు.. భాజపా ప్రభుత్వం కాదా? దేశమంతా ఇవ్వండి.. మేము వద్దంటున్నామా? ఒక కులపిచ్చి, ఒక మతపిచ్చి పార్టీ తెలంగాణలో పాగా వేస్తాయనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.