రెండు రోజుల క్రితం తన వాహనానికి చలానా విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. తన కార్యాలయానికి పిలిపించుకొని సత్కరించారు. రాంగ్రూట్లో వచ్చిన తన వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలానా విధించడంపై ప్రశంసలు కురిపించారు. తన వాహనంపై ఉన్న చలానాను చెల్లించారు. సామాన్యులైనా.. ప్రజాప్రతినిధులైనా నిబంధనలు ఒక్కటేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని కేటీఆర్ అన్నారు. చలానా విధించిన రోజు తాను వాహనంలో లేనని స్పష్టం చేశారు.
సరైన సందేశం ఇచ్చేందుకే..
విధి నిర్వహణలో నిజాయతీగా వ్యవహరించే అధికారులకి తాము ఎప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకూ సరైన సందేశం ఇచ్చేందుకే ట్రాఫిక్ సిబ్బందిని అభినందించానని.. ఈ విషయాన్ని తెరాస శ్రేణులు గుర్తించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.