ఈ నెలాఖరులోపు రైతులందరికీ ధాన్యం సేకరణ డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. మొదటి విడతగా వచ్చే మంగళ, లేదా బుధవారం నాడు రైతులకు రూ. 1600 కోట్లు చెల్లిస్తామన్నారు. మిగిలిన ధ్యాన్యం బకాయిలు ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణ కింద కేంద్ర ప్రభుత్వం రూ. 5,056 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. వీటిని రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ నెల 25 నాటికి రూ. 1600 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. రూ.1600 కోట్ల రుణాన్ని ఈనెల 20 లేదా 21 తేదీల్లో నాబార్డు అందజేయనున్నట్లు చెప్పారు.
ధాన్యం సేకరణ డబ్బును 21 రోజుల్లో చెల్లించాలనే నియమాన్ని సీఎం జగన్ పెట్టుకున్నారన్నారు. ఆ మేరకే ధాన్యం బకాయిలను చెల్లిస్తున్నట్లు తెలిపారు. 21 రోజుల గడువు దాటి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు రూ.1204 కోట్లు మాత్రమేనని మంత్రి కొడాలి స్పష్టం చేశారు. ధాన్యం బకాయిలను ప్రభుత్వం వాడుకుందని ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏడాదికి రూ. 16 వేల కోట్లు చొప్పున ధాన్యం డబ్బు రైతులకు చెల్లించామని మంత్రి గుర్తు చేశారు.